INDW Vs PAKW Innings Match Highlights: 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్ రేసులోకి వచ్చేసింది. ఆదివారం మధ్యాహ్నం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన టీమిండియా అద్భుతమైన బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 105 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం టీమిండియా 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి రేసులోకి తిరిగి వచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నా భారత్ మిగిలిన మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాల్సి ఉంది.
ఆచితూచి ఆడిన భారత బ్యాటర్లు...
106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (7: 16 బంతుల్లో) ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వెనుదిరిగారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (32: 35 బంతుల్లో, మూడు ఫోర్లు), వన్ డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (23: 28 బంతుల్లో) ఆచితూచి ఆడారు. ముఖ్యంగా డ్యాషింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మ తన సహజ శైలికి భిన్నంగా, పరిస్థితులకు అనుగుణంగా ఆడారు. దీంతో స్కోరింగ్ రేటు మందగించినా కొట్టాల్సిన స్కోరు తక్కువ కావడంతో ఎక్కువ భయపడాల్సిన అవసరం రాలేదు. వీరు ఇద్దరూ రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించారు.
స్కోరు 61 పరుగులకు చేరిన అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో షెఫాలీ వర్మ అవుటయ్యారు. తర్వాత కాసేపటికే జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (0: 1 బంతి) వరుస బంతుల్లో అవుటయ్యారు. దీంతో భారత్ కాస్త కష్టాల్లో పడినట్లు కనిపించింది. కానీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (29: 24 బంతుల్లో, ఒక ఫోర్) పాకిస్తాన్‌కు ఇంకో అవకాశం ఇవ్వలేదు. చివర్లో హర్మన్ ప్రీత్ కౌర్ రిటైర్డ్ హర్ట్ అయినా దీప్తి శర్మ (7 నాటౌట్: 8 బంతుల్లో, ఒక ఫోర్), ఎస్ సజనా (4 నాటౌట్: 1 బంతి, ఒక ఫోర్) మ్యాచ్ ముగించారు.
భారత మహిళల తుది జట్టు
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, ఎస్ సజన, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్
పాకిస్థాన్ మహిళల తుది జట్టు
మునీబా అలీ (వికెట్ కీపర్), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా (కెప్టెన్), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్