ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల చాలా గ్రామాలు నీట మునిగాయి. ఆస్తి, ప్రాణ, పంట నష్టాలు భారీగా జరిగాయి. ఏపీలో వరద పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీలో వరదలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్న రాహుల్ గాంధీ.. ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు తన సానుభూతి తెలిపారు. బాధితులకు కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని విధాలుగా సాయం అందించాలని రాహుల్ కోరారు. కొద్ది రోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాలకు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులకు సాయం అందిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని రాహుల్ ట్వీట్ చేశారు.
Also Read: భారీ వర్షాలకు పోటెత్తిన పాపాగ్ని నది... కుంగిపోయిన కడప-కమలాపురం వంతెన
కోవూరులో కొట్టుకుపోయిన హైవే
భారీ వర్షాలకు పెన్నా నది పోటెత్తడంతో వరదనీరు నెల్లూరుపై ప్రతాపం చూపించింది. ఇప్పటికే నెల్లూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరదనీరు రోడ్లపైకి పోటెత్తింది. ఈ ప్రవాహ ఉద్ధృతికి హైవేలు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు-ముంబయి హైవే వరద నీటిలో మునిగిపోయింది. తాజాగా నెల్లూరు - విజయవాడ రహదారి మార్గానికి ఏకంగా గండి పడింది. పెన్నా నదిపై ఉన్న బ్రిడ్జ్ దాటిన తర్వాత కోవూరు సమీపంలో నెల్లూరు-విజయవాడ హైవే వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అటు నెల్లూరు-గూడూరు మధ్య కూడా వరద నీటికి రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఎక్కడి వాహనాలు అక్కడే హైవేపై నిలిచిపోయాయి. ఇటు నెల్లూరు-విజయవాడ మార్గం కూడా ఇప్పుడు కొట్టుకుపోవడంతో వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరి నిలిచిపోయాయి.
Also Read: ప్రాణాలు కాపాడేందుకు వచ్చి.. విగత జీవిగా మారిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్
ప్రమాదస్థాయిలో రాయల చెరువు
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువులో వరద నీరు ప్రమాద స్థాయిలో చేరుకుంది. రాయలచెరువు చుట్టుప్రక్కల ఐదు గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రాయల చెరువుకు కుప్పంబాదురు వైపు లీకేజీ కావడంతో సమీప గ్రామలైన రాయల చెరువు గ్రామం, కాలేపల్లి, చిత్తల్లత్తూరు, గొల్లపల్లి, సూరవారిపల్లి గ్రామల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఏఫ్ సిబ్బంది రాయల చెరువు సమీప గ్రామాలకు చేరుకున్నారు. ఇప్పటికే ఐదు గ్రామాలు పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. నీటిలో మునగడంతో నివాసాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు.
Also Read: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు