నెల్లూరు జిల్లాలో జరిగిన వరద సహాయక చర్యల్లో విషాదం చోటు చేసుకుంది. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లోని ఓ కానిస్టేబుల్ వరద నీటిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని బుచ్చి మండలం దామరమడుగు వద్ద జరిగింది. వరదల్లో చిక్కుకుపోయిన బాధితులను కాపాడేందుకు టీమ్ తో కలిసి కెల్లా శ్రీనివాసులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాడు. అయితే వరదనీటిలో దిగిన తర్వాత లైఫ్ జాకెట్ తెగిపోవడంతో ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతడిని తోటి కానిస్టేబుళ్లు రక్షించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. 


సోమశిల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో నెల్లూరు జిల్లాలో పెన్నా పరివాహక ప్రాంతం అతలాకుతలం అయింది. పెన్నా నదివెంట ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ ముంపు బారిన పడ్డాయి. నెల్లూరు సమీపంలో ఉన్న బుచ్చి, దామరమడుగు, పడుగుపాడు, కోవూరు, పాటూరు ప్రాంతాల్లో కూడా భారీగా వరదనీరు వచ్చి చేరింది. దామరమడుగు గ్రామం వరదనీటిలో ముంపునకి గురైంది. దీంతో వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిచి స్థానిక పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. 
Also Read: Anantapur Rains: కదిరిలో కూలిన భవనాలు.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది


విజయనగరం జిల్లా ఐదో బెటాలియన్ కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కెల్లా శ్రీనివాసులు కూడా ఈ బృందంలో ఉన్నారు. నెల్లూరు జిల్లా రెస్క్యూ ఆపరేషన్ కు వచ్చిన ఆయన.. దామరమడుగు గ్రామం వద్ద వరదనీటిలో సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. పడవలో దామరమడుగు ప్రాంతంలో చిక్కుకున్న వరద బాధితుల్ని కాపాడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో బాధితుల వద్దకు వెళ్లేందుకు శ్రీనివాసులు నీటిలో దిగాడు. అప్పటికే ఆయన లైఫ్ జాకెట్ వేసుకుని ఉన్నాడు. అయితే వరద తాకిడికి లైఫ్ జాకెట్ తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా నీటి ప్రవాహానికి  శ్రీనివాసులు కొట్టుకుపోయాడు. తోటి కానిస్టేబుళ్లు రక్షించేలోపే విగతజీవిగా మారాడు. 


సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చిన కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు మరణించిన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో విషాదంగా మారింది. జిల్లా ఎస్పీ విజయరావు కానిస్టేబుల్ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశారు. నెల్లూరు నగరం, పెన్నా తీరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టాయి.


వరదలో చిక్కుకుపోయిన బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. పడవల్లో ఒడ్డుకు చేర్చి అక్కడినుంచి ఆర్టీసీ బస్సుల్లో, ఆటోల్లో తరలిస్తున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లకు స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది సహకరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పెన్నా వరద ప్రవాహం కాస్త తగ్గడంతో.. రక్షణ చర్యల్ని వేగవంతం చేశారు.


Also Read: తిరుపతిలో వరద బీభత్సం... ప్రమాదకరంగా రాయలచెరువు కట్ట... అప్రమత్తంగా ఉండాలని అధికారుల దండోరా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి