తిరుమల కొండపై వరద బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి సప్తగిరులు తడిసిముద్దైయ్యాయి. ఏడుకొండలపై ఎటు చూసిన జలధారలే కనిపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే ఘాట్ రోడ్లలో భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ డేటా సెంటర్ లోకి నీరు ప్రవేశించడంతో ఆన్ లైన్ సేవలన్నీ స్తంభించాయి. వాయిగుండం ప్రభావంతో శుక్ర అర్ధరాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఆగకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలోని చాలా ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్డులో వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా...స్థానికులు నివసించే బాలాజీనగర్ ప్రాంతంలోనూ వరద నీరు ఏరులై పారుతోంది. 



ఘాట్ రోడ్డుల్లో విరిగిపడుతున్న కొండ చరియలు


శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే రెండో ఘాట్ రోడ్డుతో పాటు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోనూ భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వరదను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే టీటీడీ నడకదారులను మూసివేసింది. భారీగా కురిసిన వర్షానికి పలు చోట్ల కల్వర్టర్లు కొట్టకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయి. రెండో ఘూట్ రోడ్డులో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. చెట్లు నెలకొరిగాయి. మొదటి, రెండో ఘాట్ రోడ్డులో పలుచోట్ల చెట్లు, బండరాళ్లు, మట్టి పెళ్లలు రోడ్డుపై పడుతుండడంతో టీటీడీ భద్రతా, ఇంజనీరింగ్, అటవీ సిబ్బంది బృందాలు ఎప్పటికప్పుడు జేసీబీల సహాయంతో వాటిని తొలగిస్తున్నారు. 


Also Read:  గుండె చెరువైన సీమ, నెల్లూరు .. ఎటు చూసినా ప్రళయ బీభత్స దృశ్యాలే ! 
స్తంభించిన ఆన్ లైన్ సేవలు


ఘాట్ రోడ్డులోని కొంచరియలను తొలగించడంతో ఇవాళ్టి నుంచి రెండో ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులో ఉంచింది టీటీడీ. భారీ వర్షానికి తిరుమల కొండపై దాదాపు అన్ని నెట్ వర్క్ వ్యవస్థలు స్తంభించాయి. దీంతో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ పని చేయకపోవడంతో భక్తులు మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక టీటీడీ డేటా సెంటర్ లోకి వర్షపు నీరు ప్రవేశించడంతో ఆన్ లైన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గదుల కేటాయింపు, టిక్కెట్లు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని చోట్ల భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ మాన్యువల్ గా గదులను కేటాయిస్తోంది. శ్రీవారి నడక‌మార్గం పూర్తిగా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారం రోజులు పట్టే పరిస్థితి ఉంది. 


Also Read: నెల్లూరులో వర్షం తగ్గినా వదలని వరద.. హైవేలపై నీటితో రాకపోకలకు తీవ్ర అంతరాయం


జలదిగ్బంధంలో గ్రామాలు...అంధకారంలో తిరుపతి


జిల్లా వ్యాప్తంగా మొత్తం 430కి పైగా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పడమటి మండలాలు వరద దాటికి కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలోని స్వర్ణముఖి నది, బాహుదా నది, కార్గేయ నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరుపతిలో సుమారు 20కి పైగా డివిజన్లు వరద నీటలో చిక్కుకోవడంతో అధికారయంత్రం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. చిత్తూరు తిరుపతికి వెళ్ళే మార్గంలో పలు చోట్ల బ్రిడ్జ్ లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. తిరుపతి నగరంలో భారీ వృక్షాలు కూలడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో గత రెండు రోజులుగా అంధకారంలోనే తిరుపతి నగర వాసులు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Also Read: ఇప్పటికే ముంచేసిన వాన.. ఇవాళ మళ్లీ భారీ నుంచి అతిభారీ వర్షాలు 


నీట మునిగిన రాయలచెరువు చుట్టుపక్కల గ్రామాలు 


తిరుపతి రామచంద్రాపురం మండలం రాయలచెరువు వరద నీటి కారణంగా చుట్టుపక్కల ఐదు గ్రామాలు నీటమునిగాయి. రాయల చెరువు గ్రామం, కాలేపల్లి, చిట్టలూరు, గొల్లపల్లి, సూరవారిపల్లి చుట్టుపక్కల గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సాగు నీటి కోసం గుర్రపు తుమ్ములను ఏర్పాటు చేశారు. ఆ గుర్రపు తమ్ములను మూసివేయడంతో సాగునీరు గ్రామాల్లో ప్రవేశిస్తుంది. రాయల చెరువు కట్ట ప్రమాదకరంగా మారింది. ఏ క్షణమైన కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామాల్లో అధికారులు దండోరా వేయించారు. 


Also Read: కదిరిలో కూలిన భవనాలు.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి