ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు కకావికలమయ్యాయి. అనంతపురంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగి.. గ్రామాల నుంచి వరద పోటెత్తుతోంది. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించి.. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నాయి.


అనంతపురం జిల్లా కదిరి పాత ఛైర్మన్‌ వీధిలో రెండు భవనాలు కూలిపోయాయి. ఓ భవనం కూలి.. పక్కనున్న మరో భవనంపై పడింది. ఈ కారణంగా ఆ భవనం సైతం.. నేలమట్టమైంది. శిథిలాల కింద 11 మంది చిక్కుకున్నారు. నలుగురిని అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతోపాటు మరో నలుగురు మృతి చెందారు. సైదున్నిసా(3), పరిధున్నిసా(2) ఏళ్లు ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంట సమయంలో  నిద్రలో ఉండగా సంఘటన చోటు చేసుకుంది. భవన శిథిలాలను పోలీసులు, రెస్క్యూ టీం అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ముగ్గురు భౌతిక కాయలను బయటకు తీశారు. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది.


కడపలో 12 మంది మృతి


కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం జరిగింది. దాదాపు 30 మంది వరదలో కొట్టుకు పోగా ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని కండక్టర్‌, ఇద్దరు ప్రయాణికులు వరదలో కొట్టుకుపోయారు. వరద ఉద్ధృతికి కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు ఉన్నారు.  


దాదాపు 50 మంది గల్లంతు : ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి


చెయ్యేరు నది జలవిలయం కనివిని ఎరుగని విపత్తు అని, ఎవ్వరూ ఊహించని విధంగా వరద నీరు పొటెత్తిందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ అన్నారు. రాజంపేట నందలూరు, చొప్పవారి పల్లెలో వరద బీభత్సాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో దాదాపు 50 మంది గల్లంతయ్యారని అంచనా అన్నారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను గుర్తించామన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అదేశించారన్నారు. సమాచారం తెలిసిన వెంటనే నీళ్లలొ చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ పంపారన్నారు. మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించడం జరిగిందన్నారు. ఎక్స్ గ్రేషియోను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. రేపటికి మృతుల విషయంలో క్లారిటీ వస్తుందన్నారు.


Also Read: Weather Update: ఇప్పటికే ముంచేసిన వాన.. ఇవాళ మళ్లీ భారీ నుంచి అతిభారీ వర్షాలు