Rain Updates: భారీ వర్షాలకు పోటెత్తిన పాపాగ్ని నది... కుంగిపోయిన కడప-కమలాపురం వంతెన

వాయుగుండం పుదుచ్చేరి - చెన్నై మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ABP Desam Last Updated: 20 Nov 2021 09:06 PM
భారీ వర్షాలకు పోటెత్తిన పాపాగ్ని నది... కుంగిపోయిన కడప-కమలాపురం వంతెన

కడప- కమలాపురం మార్గంలో పాపాగ్ని బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. ఈ వంతెన ఏ క్షణంలో నైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. బ్రిడ్జి వద్ద పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. జిల్లా ఎస్పీ  కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ప్రమాదాన్ని ముందస్తుగా గుర్తించి నేషనల్ హై వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసు కోరారు.  ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వాహనదారులను అప్రమత్తం చేస్తూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. బ్రిడ్జికి ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కమలాపురం నుండి బ్రిడ్జి మీదుగా కడప వైపు వాహనాలు రాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. వల్లూరు మీదుగా వెళ్లే వాహనాలు బ్రిడ్జి వైపు రాకుండా దారి మళ్లిస్తున్నారు. 

నెల్లూరు జిల్లాలో విషాదం... సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ మృతి

నెల్లూరు జిల్లా బుచ్చి మండలం దామరమడుగు వద్ద వరద సహాయక చర్యల్లో విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో పడి ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతి చెందిన కానిస్టేబుల్ విజయనగరం జిల్లా ఐదో బెటాలియన్ కు చెందిన కెల్లా శ్రీనివాసులుగా గుర్తించారు. దామరమడుగు వరద నీటిలో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు వెళ్లిన శ్రీనివాసులు ప్రమాదంలో మృతి చెందారు. లైఫ్ జాకెట్ తెగిపోవడంతో వరద నీటిలో కొట్టుకుపోయి ఊపిరాడక మృతి చెందినట్లు ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు.

నీట మునిగిన రైల్వే ట్రాక్.. నెల్లూరులో స్తంభించిన రాకపోకలు

నెల్లూరు నగరం చుట్టుపక్కల వరదనీరు ముంచెత్తింది. దీంతో నగరానికి రవాణా స్తంభించింది. రోడ్డు మార్గం అన్నివైపులా నీట మునిగింది. అటు రైల్వే ట్రాక్ కూడా ధ్వంసమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు రైల్వే ట్రాక్ పైకి చేరుకున్నారు. అయితే క్రమంగా రైల్వే ట్రాక్ పైకి వరదనీరు వచ్చి చేరడంతో బాధితులు అక్కడి నుంచి తరలి వెళ్లారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. ఇప్పటికే ఈ మార్గంలో వచ్చే రైళ్లను అధికారులు నిలిపివేశారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాతే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. 

చెయ్యేరు వరదలో 26 మంది గల్లంతు

కడప జిల్లాలో వరద బీభత్సంతో చాలా గ్రామాలు వరద ముంపులో మునిగాయి. చెయ్యేరు నది వరదలో 26 మంది గల్లంతు అయ్యారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చెయ్యేరు నది ఒడ్డున శివాలయంలో కార్తీక పూజలకు వచ్చిన భక్తులు వరదలో కొట్టుకుపోయారని ప్రభుత్వం తెలిపింది. పూజారి కొర్రపాటి రామ్మూర్తి కుటుంబంలో 9 మంది మృతి చెందారని ప్రకటించింది.   

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు వెళ్లారు. ఏరియల్ సర్వే అయిపోయాక.. తిరిగి విజయవాడ వస్తారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిస్థితి సమీక్షిస్తారు.

   తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులకు అనుమతి

వాయుగుండం ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆగిన తిరుమల ప్రయాణాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించింది. తిరుమల ఘాట్‌రోడ్‌లో భక్తులను అనుమతిస్తోంది. అయితే.. అలిపిరి మెట్ల మార్గంలో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ కారణంగా అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం మూసివేశారు. వరద ప్రభావానికి శ్రీవారి మెట్లు కొట్టుకుపోయాయి.

Background

చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వానలు ఎక్కువగా పడ్డాయి. బంగాళఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదిలిన వాయుగుండం. పుదుచ్చేరి-చైన్నై మధ్య శుక్రవారం తీరం దాటిందని ఐఎండీ అధికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. వాయుగుండంలో ప్రభావంతో తమిళనాడు, ప్రకాశం చిత్తూరు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలలి సూచించింది.


ఏపీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపింది.


తిరుపతిలో ఎన్నడూ లేనంత వర్షం దంచికొడుతుంది. భారీ వర్షాల కారణంగా గ్రామాలు, కాలనీలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాలు వరదలతో జలవిలయంతో వైకుంఠ క్యూలైన్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. శ్రీవారి మాడవిధులు చెరువుల్లా కనిపించాయి. 


తెలంగాణలోనూ పలుప్రాంతాల్లో వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులంబ గద్వాల్ జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపు జిల్లా మీదుగా నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్ల దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి నుండి కడప మీదుగా నడిచే రైళ్ల సర్వీసులు రేపు రద్దయ్యాయి. రేణిగుంట గుంతకల్లు, గుంతకల్లు రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైల్వే సర్వీస్ రద్దు అయింది. కడప విశాఖపట్నం, విశాఖపట్నం కడప మధ్య నడిచే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఔరంగబాద్ రేణిగుంట, చెన్నై లోకమాన్య తిలక్, చెన్నై అహ్మదాబాద్, మదురై లోకమాన్య తిలక్ మధ్య నడిచే రైళ్ల రద్దు చేశారు. వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, ముంబై ఎక్స్ ప్రెస్, గోవా, హజ్రత్ నిజముద్దిన్  రైళ్లను దారి మళ్లించారు.


కడప చిత్రావది నదికి వరద ఉద్ధృతి పెరిగింది. చిత్రావతి జలాశయం ఏడు గేట్లు ఎత్తివే వేశారు. చిత్రావతి నీటికి తోడు పరివాహాక ప్రాంత వర్షాలతొ...గండికోట, మైలవరం జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. గండి కోట నుంచి మైలవరానికి లక్షన్నర క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. మైలవరం నుంచి పెన్నా నదికి లక్షన్నర క్యూసెక్కులు విడుదల చేశారు. కుందునదికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, చాపాడు, ఖాజీపేట, చెన్నూరు మండలాలకు వరద ముప్పులో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.