ఎట్టకేలకు సీఎం జగన్‌తో నేడు (జనవరి 6) భేటీకానున్నారు ఏపీ ఉద్యోగసంఘాల నేతలు. దాంతో గత కొంత కాలంగా కొనసాగుతున్న పీఆర్సీ హైడ్రామాకు తెరపడనుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ పలుదఫాలు అధికారులతోనూ, మంత్రులతోనూ చర్చలు జరిపినా పీఆర్సీపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఉద్యోగసంఘాల అసహనంతో ఉన్నాయి. దీంతో ఇక సీయంతోనే తేల్చుకుంటాం అంటూ పలుమార్లు చెప్పిన ఉద్యోగ సంఘాల నేతలు చివరకు తాము డిమాండ్ చేసిన క్షణానికి చేరువయ్యారు. ఈ రోజు చర్చల అనంతరం పీఆర్సీపై ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వెలువడుతుందనే ఆశలో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. 


నిన్ననే సీఎం వద్దకు పీఆర్సీ చర్చల వివరాలు
ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్ అయితే ఏకంగా రెండుసార్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జలతో మూడు సార్లు, ఆర్థిక మంత్రి బుగ్గనతో రెండుసార్లు, చీఫ్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రటరీ అంటూ అందరితోనూ అనేక మార్లు చర్చలు జరిపాయి ఉద్యోగ  సంఘాలు. అయితే తాము డిమాండ్ చేసిన 48 శాతం పీఆర్సీపై ప్రభుత్వం నుండి రెడ్ సిగ్నల్ రావడం, ఏకంగా 14. 29 శాతం వద్దే ఫిక్స్ చేస్తామంటూ చెప్పడంతో ఉద్యోగ సంఘాలు షాక్ తిన్నాయి. ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి పొందుతున్న తమకు పీఆర్సీ 14. 29 శాతం అంటే ఇప్పుడువస్తున్న జీతంలో 13 శాతం వరకూ కోతపడుతుందనీ.. పీఆర్సీ వాళ్ళ జీతం పెరగడం మాట అటుంచి తగ్గడం ఏంటంటూ వారు ఖంగుతిన్నారు. అయితే ఈ భయాలన్నీ అర్థరహితం అనీ జీతాలు తగ్గకుండానే ఆ పీఆర్సీ అమలు చేస్తామంటూ సజ్జల లాంటి వాళ్ళు హామీ ఇచ్చినా ఉద్యోగ సంఘాలు నమ్మలేదు. దాంతో గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది 


కేవలం పీఆర్సీ ఒక్కటే సమస్య కాదు: ఉద్యోగ సంఘాలు
తమది కేవలం పీఆర్సీ ఒకటే సమస్య కాదనీ మొత్తం 71 డిమాండ్లు తమ వద్ద ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అలాగే మధ్యంతర భృతికి  చెందిన ఎరియర్స్ ఇంకా ఉద్యోగులకు అందలేదు. అలాగే పెండింగ్ డీఏలు కూడా. వీటన్నింటికి ఇప్పటికిప్పుడు రూ.1,600 కోట్లు కావాలి. ఉద్యోగుల డిమాండ్లలో ఇదీ ముఖ్యమే. అలాగే హెచ్ఆర్ఏకి సంబంధించిన సమస్యలూ ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ ఆసక్తికరంగా మారింది. 


మధ్యేమార్గంగా 30 శాతం దగ్గర పీఆర్సీ 
ఉద్యోగులు మొదట నుండీ డిమాండ్ చేస్తున్న 55 శాతం, తర్వాత కోరిన 48 శాతం పీఆర్సీ ఇచ్చే పరిస్థితి ఆర్థికంగా ఏపీ ప్రభుత్వానికి లేదు. అలానే ప్రభుత్వం చెబుతున్న 14.29 శాతం పీఆర్సీకి ఉద్యోగులు ఒప్పుకునే అవకాశమూ లేదు . వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు అందుకుంటున్న 27 శాతం మధ్యంతర భృతికి మరికొంత కలిపి 30 శాతానికి కాస్త అటుఇటుగా పీఆర్సీ ఇవ్వనున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే ఈరోజు సమావేశం పూర్తయ్యేవరకూ ఆగాల్సిందే.


Also Read: RGV: 'ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ' స్పందించిన వర్మ.. 


Also Read: RGV Vs Perni Nani: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు


Also Read: RGV: పవన్ సినిమాకి సంపూ సినిమాకి తేడా లేనప్పుడు మీ ప్రభుత్వంలో మంత్రికి డ్రైవర్‌కి కూడా తేడా లేదా? ఆర్జీవీ స్ట్రాంగ్‌ కౌంటర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి