అనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో
అంబానీల ఇంట కనిపించిన గంటల వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లోని కొంపల్లిలో కొలువు దీరాడు. జులై నెలలో ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలో 12 వేల గంటలతో తయారైన వినాయకుడు అక్కడకు వచ్చిన అతిథులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అదే వినాయకుడిని హైదరాబాద్ కు చెందిన వ్యాపార సంస్థ రాయ్ చాందినీ గ్రూప్, వినాయక నవ రాత్రుల కోసం ముంబై నుంచి హైదరాబాద్ కొంపల్లి లోని రాయ్ చాందినీ మాల్ కు తరలించారు. ఆ గంటల వినాయకుడు రాయ్ చాందినీ మాల్ కు వచ్చేవారికి కనువిందు చేస్తున్నాడు. ఈ గంటల వినాయకుని తయారు చేయడానికి ఆరుగురు వ్యక్తులు 12 గంటలు కష్టపడ్డారు. దీని ఎత్తు 10 అడుగుల వరకు ఉంటుందని మాల్ మేనేజర్ తెలిపారు. గంటల వినాయకుడి సందర్శనార్థం వచ్చే భక్తుల కోసం మాల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.