Mariyapuram Family Tombs | మరియపురం గ్రామంలో వింత ఆచారం...కుటుంబ సమాధుల రహస్యం ఏంటీ..? |ABP Desam
ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం. ఏం చేస్తాం. దహనసంస్కారాలు చేస్తారు లేదా సమాధి చేస్తారు. సరే ఈ ఊరి పేరు మరియపురం. ఇక్కడో వింత ఆచారం ఉంది. అదేంటంటే ఈ ఊరిలో ఎవరైనా చనిపోతే వాళ్ల కుటుంబంలో ఇంతకు ముందు మరణించిన వారి సమాధి ఎక్కడుందో చూసి అక్కడే సమాధి చేస్తారు. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. అందుకే మరియపురంలో ఎక్కడ చూసినా కుటుంబసమాధులే కనిపిస్తాయి. జనగామ జిల్లా మరియపురంలో ఉండే రోమన్ క్యాథలిక్కులు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. భూమి తక్కువగా ఉండటం వల్ల తమకు ఉన్న భూమిలోనే సమాధులను కట్టుకోవాలి కాబట్టి ఈ కుటుంబ సమాధుల ఆచారాన్ని ప్రారంభించారు. వీరంతా 80ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రాంతం నుండి వచ్చారని ఇక్కడ మరియపురం పేరుతో గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. 20 సంవత్సరాల క్రితం వరకూ అందరిలానే మనిషికి ప్రత్యేకంగా ఓ సమాధిని నిర్మించేవారు. కానీ ఆ తర్వాత భూమి కొరత కారణంగా ఈ చర్చి ప్రాంగణంలో ఇలా కుటుంబానికి ఒకటే సమాధిని కేటాయించుకునే ఆచారాన్ని ప్రారంభించామని చెబుతున్నారు.గ్రామంలో ఓ కుటుంబంలో ఓ వ్యక్తి మరణిస్తే..అతని భార్య...పెళ్లి కాని పిల్లల వరకూ ఓ కుటుంబంగా భావిస్తారు. ఆ కుటుంబంలో మరో వ్యక్తి ఎవరైనా మరణిస్తే కుటుంబంలో అప్పటికే మరణించిన వ్యక్తి పక్కనే మరో సమాధిని కడతారు. ఇంకెవరైనా మరణిస్తే ఓ అపార్ట్ మెంట్ లా ఆ సమాధిపైన మరో సమాధి పెడతారు. ఇలా కుటుంబం మొత్తం సమాధి ఇలా ఒక్కచోటే ఉంటుందన్నమాట. చనిపోయిన తర్వాత వాళ్లు తమ వాళ్ల దగ్గరే విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన కూడా ఇందులో ఉందని స్థానికుడైన బాలశౌరెడ్డి చెబుతున్నారు వినండి.