KKR Won IPL 2024 Season Trophy | ఫైనల్లో సన్‌రైజర్స్‌పై నైట్‌రైడర్స్ ఘనవిజయం | ABP Desam
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2024 సీజన్‌ను గెలుచుకుంది. ఆదివారం చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించారు. 2012, 2014ల్లో రెండు సార్లు ఐపీఎల్ గెలిచిన కోల్‌కతాకు ఇది మూడో ట్రోఫీ. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అనంతరం కోల్‌కతా 10.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టాప్-5 హైలెట్స్ ఏం చూద్దాం.
1. టాస్ దగ్గర తప్పు చేసిన కమిన్స్ - ఛేజింగ్ ఫ్రెండ్లీ పిచ్ అయిన చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంతకు ముందు మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఫస్ట్ బ్యాటింగ్ చేసి సాధించిన విజయం నమ్మకం ఇవ్వడంతో కమిన్స్ ఈ డెసిషన్ తీసుకున్నాడు. రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకోగానే శ్రేయస్ అయ్యర్ మాక్కావాల్సిందే జరిగింది అన్నప్పుడే అర్థం అయింది కేకేఆర్ ఫుల్ ప్లానింగ్‌తో దిగిందని.
2. కోల్‌కతా బౌలర్స్ ఆన్ మార్క్ - ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మొదట్లో పిచ్ నుంచి లభించిన సహకారాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు. వేగంగా వికెట్లు తీసి రైజర్స్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్‌కు బలంగా నిలిచిన టాప్ ఆర్డర్‌ను ఫైనల్లో కట్టడి చేశారు.
3. 24 కోట్లు వర్కవుట్ అయ్యాయి - ఐపీఎల్ 2024 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ మిషెల్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు నవ్వుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. టోర్నీ ప్రారంభంలో కూడా స్టార్క్ ప్రదర్శన అంత అద్భుతంగా లేదు. కానీ కీలకమైన ప్లేఆఫ్స్‌లో స్టార్క్ దుమ్మురేపాడు. మొదటి క్వాలిఫయర్‌లో మూడు వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఫైనల్లో కూడా రెండు వికెట్లు పడగొట్టాడు.
4. బోల్తా కొట్టిన రైజర్స్ టాప్ ఆర్డర్ - ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ బలం బ్యాటింగే. టీమ్ అంతా కాటేరమ్మ కొడుకులే అని ఫ్యాన్స్ మీమ్స్ వేసుకుని ఎంజాయ్ చేశారు. కానీ ఫైనల్స్‌కు వచ్చేసరికి మాత్రం కాటేరమ్మ కొడుకులు అంతా హ్యాండిచ్చారు. సీజన్ అంతా భీకరమైన ఫామ్‌తో రాణించిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురూ కలిసి ఫైనల్స్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగారు.
5. కోల్‌కతా మూడో టైటిల్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇది మూడో టైటిల్. గతంలో 2012, 2014ల్లో కూడా కోల్‌కతా విజేతగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తర్వాత అత్యధిక కప్‌లు కొట్టిన మూడో జట్టుగా నిలిచింది. చెన్నై, ముంబై ఖాతాలో చెరో ఐదు ట్రోఫీలు ఉన్నాయి.