Marquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam
ఈ నెల 24,25 వ తేదీల్లో ఐపీఎల్ వేలం జరగనుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరగనున్న ఈ ఆటగాళ్ల వేలంలో మొదటి రోజు చాలా కీలకం. ఎందుకంటే ఆ రోజే మార్కీ ప్లేయర్స్ వేలం జరుగుతుంది కాబట్టి. ఏంటీ మార్కీ ప్లేయర్స్ అంటే...ఐపీఎల్ లో ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా కొంత మంది ఆటగాళ్లను ప్రత్యేకంగా లిస్ట్ చేస్తారు. వాళ్లనే మార్కీ ప్లేయర్స్ అంటారు. ఈ సారి వేలం కోసం 12మంది ఆటగాళ్లను రెండు జాబితాలుగా లిస్ట్ అవుట్ చేశారు. ఢిల్లీ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ మార్కి ప్లేయర్ల కోటాలోనే ఉన్నాడు. పంత్ తో పాటు కోల్ కతాకు ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ కు కీలక ఓపెనర్ గా సేవలు అందించిన జోస్ బట్లర్, పంజాబ్ వదిలేసిన కగిసో రబడ, అర్ష్ దీప్ సింగ్, గత వేలంలో 24కోట్ల 75లక్షలు పలికి రికార్డు క్రియేట్ చేసిన మిచెల్ స్టార్క్ ఉన్నారు. ఈ ఆరుగురిని మార్కీ ప్లేయర్స్ లిస్ట్ 1 గా డిసైడ్ చేసిన ఐపీఎల్ యాజమాన్యం ముందు ఈ ఆరుగురి కోసం వేలం నిర్వహించనుంది. లిస్ట్ 1 అవ్వగానే లిస్ట్ 2 వేలం జరుగుతుంది. లిస్ట్ 2 లో లక్నోకు కెప్టెన్ గా చేసిన కేఎల్ రాహుల్, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు షమీ, డేవిడ్ మిల్లర్, రాజస్థాన్ వదిలేసిన చాహల్, పంజాబ్ నుంచి బయటకు వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్, ఆర్సీబీ వదిలేసిన మహ్మద్ సిరాజ్ లు ఉన్నారు. ఈ 12 మందిలో ఒకరు 30కోట్ల రూపాయల వేలం రికార్డు క్రియేట్ చేయొచ్చని ఈసారి భావిస్తున్నారు. ప్రతీ టీమ్ కూడా ఈ ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరు తమ టీమ్ లో ఉండాలని కచ్చితంగా కోరుకుంటాయి కాబట్టి ఈసారి మార్కి ప్లేయర్ల వేలం మంచి ఆసక్తిగా మారనుంది.