కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. అధికారికంగా ఆ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. అయోధ్యలో రాముడి వనవాసాన్ని, కేజ్రీవాల్ రాజీనామా చేయడాన్ని పోల్చుతూ పోస్ట్ పెట్టారు అతిషి. అయోధ్యలో రాముడు వనవాసం వెళ్లినప్పుడు..14 ఏళ్ల పాటు రాముడి పాదుకలు సింహాసనంపై ఉంచి భరతుడు పరిపాలన కొనసాగించాడు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ...ఇప్పుడు కేజ్రీవాల్ లేకుండా తాను కూడా భరతుడిలాగే పరిపాలిస్తానని చెప్పారు. మరో నాలుగు నెలల పాటు ఆ బాధ్యతలు చేపడతానని అన్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే...ముఖ్యమంత్రి కార్యాలయంలో...సీఎం కుర్చీలో కాకుండా...పక్కనే మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు అతిషి. అప్పటి వరకూ కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీని అలాగే ఉంచారు. ఆయనపై గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లిక్కర్ కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్... సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అతిషి ఈ బాధ్యతలు చేపట్టారు.