Karthikeya Love: రాజావిక్రమార్క ప్రీరిలీజ్ ఫంక్షన్... వేదికపై ప్రియురాలికి ప్రపోజ్ చేసిన కార్తికేయ
కార్తికేయ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బిగ్ టికెట్‌ను హీరోలు సుధీర్ బాబు, శ్రీవిష్ణు, విశ్వక్ సేన్ విడుదల చేశారు.
'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్యను కార్తికేయ పరిచయం చేశారు. తన ప్రేమకథ గురించి కార్తికేయ మాట్లాడుతూ "నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా. ఆ రోజే 'నేను హీరో అవుదామనుకుంటున్నాను. హీరో అయ్యాక మీ ఇంటికి వచ్చి అడుగుతా' అని చెప్పా. ఫైనల్లీ... ఆ అమ్మాయిని నవంబర్ 21న పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు లోహిత. తను నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, గాళ్ ఫ్రెండ్. ఎక్స్ గాళ్ ఫ్రెండ్. ఇక నుంచి ఒక్కటే రోల్.. వైఫ్" అని చెప్పారు. అనంతరం వేదికపై లోహితకు కార్తికేయ ప్రపోజ్ చేశారు.