చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణ
అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాడు. విచారణలో భాగంగా హాజరు కావాలని పోలీసులు నోటీసుల నేపథ్యంలో తండ్రి అల్లు అరవింద్‌తో పాటు అడ్వకేట్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కొన్ని అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేసుకునేందుకే అల్లు అర్జున్‌ని విచారణకు పిలిచినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై పోలీస్ ఉన్నతాధికారులు అల్లు అర్జున్ తీరుని తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ బన్నీ పెట్టిన ప్రెస్‌మీట్‌పైనా విమర్శలు వస్తున్నాయి. క్యారెక్టర్‌ని చంపేశారంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్‌పై పోలీసులు సీరియస్ అయ్యారు. తామే రూట్ క్లియర్ చేసినట్టు చెప్పడాన్నీ తప్పుబట్టారు. ఆ రోజు ఏం జరిగిందో మరోసారి వివరించారు. ఈ క్రమంలోనే విచారణపై ఉత్కంఠ క్షణక్షణానికీ పెరుగుతోంది. దాదాపు రెండు గంటల పాటు ఈ విచారణ కొనసాగనున్నట్టు సమాచారం. అయితే..సంధ్య థియేటర్‌కి తీసుకెళ్లి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు పోలీసులు.