Reasons for Madanapalle Subcollectorate Fire | మదనపల్లె సబ్ కలెక్టరేట్ ను తగుల బెట్టింది ఎవరు..?

Continues below advertisement

అవతవకలకు ఆస్కారం ఉన్న సెక్షన్ లో నే మదనపల్లె సబ్ కలెక్టరేట్  ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని డీజీపీనే చెప్పటం తో ఇప్పుడు అసలు కథ ఒకటి బయటకు వచ్చింది. అది కూడా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి సంబంధించింది.  పుంగనూరు నియోజకవర్గం రాగానిపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 22లో 982.49 ఎకరాల భూమి ఇది. అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమిని తన అనుచరుల పేరు మీద పెద్దిరెడ్డిని మార్పించారని అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో నే ఉన్నాయి కనుక దీన్ని మాజీ మంత్రి తన అనుచరులతో స్కెచ్ గీసీ తగులబెట్టించారనేది అధికార పార్టీ టీడీపీ చేస్తున్న ఆరోపణ.

ఇంతకీ ఈ భూమి చరిత్ర ఏంటంటే... పుంగనూరు జమిందార్ల పరిపాలన ఉండేది. 1907 లో అప్పటి జమిందార్ మహదేవరాయులు పేరు పైన ప్రస్తుతం రాగానిపల్లి పంచాయతీ లో వివాదాస్పదం గా మారిన 982.49 ఎకరాల భూమి ఉండేది. అది సాగు భూమి కాకపోయినా జమీందార్ల ఆధీనంలోనే ఉండేది. ఎస్టేట్ రద్దు చట్టం 1948 ప్రకారం ఒకరి పేరు పై అంత భూమి ఉండకూడదని జమిందారు పేరు పై భూమిని రద్దు చేసారు. 1970-72 సంవత్సరం లో జమిందార్ మహాదేవరాయులు తనయుడు శంకర్ రాయల్ తమ భూమిని తమకు అప్పగించాలని అప్పటి అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఆప్పటి ప్రభుత్వ అధికారులు రఫ్ పట్టాను శంకర్ రాయలు పేరు పై ఇచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1978 ఆ రఫ్ పట్టాను రద్దు చేసి అది ప్రభుత్వ అటవీ భూమిగా నిర్ధారించారు. 1978 నుంచి 2022 వరకు పుంగనూరు నియోజకవర్గం రాగానిపల్లి పంచాయతీ పరిధిలోని 982.49 ఎకరాల భూమి అటవీ శాఖ కు సంబంధించినది గా ఉండేది. 2022లోనే ఈ భూమిని 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించి కొంత మంది అనుచరుల పేర్ల మీద పెద్దిరెడ్డి మార్పించుకున్నారనేది వినిపిస్తున్న ఆరోపణ. 

అటవీ భూమికి 12 అడుగుల మేర ట్రెంచ్ ఏర్పాటు చేశారు. ఏనుగులు, చిరుతలు ఇతర జంతువులు జనసంచారం లోకి రాకుండా అటవీ శాఖ తీసే ట్రెంచ్ లాగా ఈ భూమి చుట్టూ గోతులు తీశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఈ భూమి మార్పు ఎలా జరిగిందనే అంశంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభమైంది. ఈ స్కామ్ బయటకు రాకూడదనే మదనపలె సబ్ కలెక్టరేట్ ను తగులబెట్టారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram