TDP News: యాత్రలతో టీడీపీ దండయాత్ర.. చంద్రబాబు, లోకేశ్ రె'ఢీ'!
పర్యటనలు, పరామర్శలతో ఈ మధ్య టీడీపీ నేత లోకేష్ కాస్త స్పీడ్ పెంచారు. జగన్ ప్రభుత్వానికి దాదాపు రెండున్నర ఏళ్లు పూర్తవుతున్నాయి. పైగా మారే రాజకీయ సమీకరణాలు బట్టి 2024 కంటే ముందుగానే ఎన్నికలు జరగొచ్చనే అంచనాలు కూడా వున్నాయి. ఇలాంటి టైంలో జనం లోకి వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు.
సైకిల్ యాత్ర చేయాలా? లేక పాదయాత్ర చేయాలా? అని పార్టీ నేతలతో చర్చిస్తున్నారట. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేయడం.. టీడీపీకి కలిసొచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అంతకుమందుసారి చంద్రబాబు బస్సు యాత్ర చేసినా అంతగా కలిసిరాలేదు.
అందుకే ఇప్పుడు పాదయాత్ర, సైకిల్ యాత్రపై సమాలోచనలు జరుగుతున్నాయి. బాబు సైకిల్ యాత్ర, లోకేష్ పాదయాత్ర చేసే అవకాశాలు కూడా ఉండొచ్చేమో అంటున్నవాళ్లూ ఉన్నారు.
ఇటీవల తండ్రితనయులు ఇద్దరూ పార్టీ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. రోజు వారి వ్యవహారాలు, ప్రభుత్వ వైఫల్యాలు, అత్యాచార ఘటనలు, నిరంతర జన సమస్యలపై లోకేష్ దృష్టి పెట్టారు. అరెస్టులు, అడ్డగింతల వరకూ వెళ్తోంది రాజకీయం. ఇక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, వ్యూహాత్మక అంశాలపై బాబు మాట్లాడుతున్నారు. అందుకే రెండు యాత్రలూ ఉండొచ్చేమో అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.