Cockroaches | బొద్దింకలను చూడగానే కొంతమంది ఎగిరి గంతేస్తారు. పామును చూసినట్లు భయపడిపోతారు. బొద్దింకలు నేరుగా మనుషులకు హాని చేయవు. కానీ, బ్యాక్టీరియాను వ్యాప్తి చేయడం ద్వారా రోగాలకు కారణమవుతాయి. అయితే, భవిష్యత్తులో ఈ బొద్దింకలే మనుషుల ప్రాణాలను కాపాడనున్నాయంటే మీరు నమ్ముతారా? ఇది కాస్త చిత్రంగానే ఉండవచ్చు. కానీ, ఇది నిజం.


సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ(Nanyang Technological University)కి చెందిన డాక్టర్ హిరోటకా సాటో 15 ఏళ్లుగా ‘సైబర్’ కీటకాల తయారీకి ప్రయత్నిస్తున్నారు. ఏదైనా విపత్తు చోటుచేసుకున్నప్పుడు డ్రోన్లు గగనతలంలో విహరిస్తూ బాధితుల కోసం గాలిస్తాయి. అయితే, భూకంపాలు లేదా మరేదైనా కారణాల వల్ల భవనాలు కూలిపోయినప్పుడు అందులో చిక్కుకున్న మనుషులను గుర్తించడం చాలా కష్టం. అయితే, బొద్దింకల ద్వారా అది సాధ్యమేనని సాటో అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రోబోటైజ్ రోచ్ (రోబోటిక్ బొద్దింకలు)ను తయారు చేస్తున్నారు.


భవనాలు కూలిపోయినప్పుడు.. అందులో చిక్కుకున్న క్షతగాత్రులను గుర్తించడం చాలా కష్టం. ఇందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. బొద్దికంలైతే చిన్న రంథ్రాల ద్వారా శిథిలాల్లోకి ప్రవేశించి క్షతగాత్రుల వరకు చేరుకోగలవని సాటో చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మడగాస్కాన్ హిస్సింగ్’ రకానికి చెందిన బొద్దింకలను సేకరించి ప్రయోగాలు జరుపుతున్నారు. ఈ బొద్దింకలు 6 సెం.మీ. పొడవు ఉంటాయి. సాటో వాటికి వెనుక భాగంలో కొన్ని చిప్స్‌‌తో కూడిన బ్యాక్‌ప్యాక్‌లను అమర్చారు. సెన్సార్‌లకు ప్రతిస్పందించే అల్గారిథమ్‌ల ద్వారా ఆ బొద్దింకలను నియంత్రిస్తున్నారు. అంటే, వీరు రిమోట్ సాయంతో బొద్దికలను ఎటైనా కదల్చవచ్చు. ఎగిరేలా చేయవచ్చు. మనమిచ్చే సంకేతాలకు స్పందిస్తూ అవి పనిచేస్తాయ్. 


Also Read: ‘డేటింగ్’ ఈమెకు జుజుబీ, ఆరుగురితో ఒకరికి తెలియకుండా మరొకరితో రొమాన్స్, చివరికి..






ఈ బ్యాక్‌ప్యాక్‌లలో ఇంకా కమ్యూనికేషన్ చిప్, కార్బన్ డయాక్సైడ్ సెన్సార్, మోషన్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ కెమెరా, బ్యాటరీ ఉంటాయి. బొద్దింకలు మనుషులు, జాగిలాలు సైతం చొరబడలేని ఇరుకైన ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లగలవని, క్షతగాత్రుల శరీర వేడి, కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలను గుర్తించడం ద్వారా అవి రెస్క్యూ టీమ్‌కు సంకేతాలు పంపిస్తాయని తెలిపారు. దీన్ని పరీక్షించడం కోసం పరిశోదకులు కాంక్రీట్ బ్లాక్‌లను ఏర్పాటు చేసి, శిథిలాల మధ్య మనుషులను ఏర్పాటు చేశారు. బొద్దింకలను తప్పుదోవ పట్టించేందుకు కొన్ని చోట్ల హీట్ ల్యాంప్, మైక్రోవేవ్, ల్యాప్‌టాప్‌లు, కుళ్లిన పదార్థాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే, బొద్దింకలు చాలావరకు ఆ సవాళ్లను అధిగమించి శిథిలాల్లో ఉన్న మనుషుల వద్దకు చేరాయి. ఈ పరీక్షలో సుమారు 87 శాతం విజయవంతమయ్యాయి. ఈ బ్యాక్‌ప్యాక్‌లను మరింత డెవలప్ చేసి.. మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డాక్టర్ సాటో వెల్లడించారు. భవిష్యత్తులో తీవ్రవాదులను గుర్తించేలా ఈ బొద్దింకలను డెవలప్ చేస్తామని అంటున్నారు. 


Also Read: ఆమె జుట్టునే గూడుగా మార్చుకున్న పక్షి, 84 రోజులు అక్కడే తిష్ట!