ఆడవాళ్లకి జుట్టే అందం. ఆ కురులను ఎంతగా వారు సంరక్షించుకుంటారో అందరికీ తెలిసిందే. చిన్న చిక్కు పడితేనే భరించలేరు. అలాంటిది ఒక యువతి తన జుట్టులో పక్షి గూడు కట్టేసినా ఏమనకుండా వదిలేసింది. ఆ పక్షిని కాపాడడమే తన లక్ష్యమని అందుకే వదిలేసినట్టు చెప్పింది. ఆ పక్షిపిల్లకు ఎగరడం వచ్చే వరకు జుట్టులోనే దాచి, తనతో పాటూ తిప్పింది. అలా ఒకటి కాదు రెండూ కాదు 84 రోజులు జాగ్రత్తగా చూసుకుంది. ఆ తరువాత ఆ పక్షికి ఎగరడం రావడంతో అడవిలో వదిలేసి వచ్చింది. ఆమె స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారింది. పేరు హన్నా బొర్నే టేలర్. నివసించేది బ్రిటన్లో. 


హన్నా పక్షి ప్రేమికురాలు. 2013 నుంచి పక్షులను గమనించడం, వాటి ఫోటోలు తీయడం, వాటి గురించి పరిశోధనలు చేయడం వంటివి చేస్తుంది. ఓసారి పెద్ద గాలివాన వచ్చి చెట్టుపై గూడు కట్టుకున్న పక్షులు చెల్లాచెదురైపోయాయి. చిన్న పక్షి పిల్ల కిందపడి ఒంటరిగా మారిపోయింది. దాని బాధ్యతను హన్నా తీసుకుంది. చనిపోయే దశలో ఉన్న ఆ పక్షిని ఇంటికి తీసుకొచ్చి కాపాడింది.ఆ పక్షి తనకుతానుగా అడవిలో బతకాలంటే కనీసం 12 వారాలు పడుతుందని, అప్పుడే అది పెద్దయ్యి, ఎగరడం వంటివి చేయగలదని తెలుసుకుంది. అంతవరకు ఆ పక్షి బాధ్యత తీసుకుంది. 


ఆ పక్షి హన్నా తలలో గూడు కట్టేందుకు ప్రయత్నించేది. ఆ విషయాన్ని గుర్తించింది ఆమె. ఆ పక్షిని అడ్డుకోకపోవడంతో కొన్ని రోజులకు చిన్న గూడు కట్టేసింది. ఆ గూడులోనే నివసించసాగింది. అలా 84 రోజుల పాటూ ఉంది.ఆ 84 రోజులు హన్నా ఎక్కడికి వెళితే అక్కడికి పక్షి కూడా వెళ్లేంది. ఇద్దరికీ విడదీయరాని బంధంగా మారిపోయింది. జుట్టు దువ్వుకోకుండా అలానే ఉంది హన్నా. ఆ తరువాత దానికి ఎగరడం వచ్చిందని నిర్ధారించుకున్నాక తిరిగి, ఆ పక్షి దొరికిన ప్రదేశానికి  వెళ్లింది హన్నా. అక్కడ మళ్లీ ఆ పక్షి జాతులన్నీ వచ్చి చేరాయి. గూళ్లు కట్టుకుని జీవించసాగాయి. వాటి మధ్యనే ఈ పక్షిని కూడా వదిలి వచ్చింది. 





Also read: విల్‌స్మిత్ భార్యది గుండు కాదు, అది అలోపేషియా సమస్య, ఎందుకొస్తుందంటే



Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు