పూర్వకాలం నాటి వంట పదార్థం మామిడికాయ పొడి. ఇప్పుడు ఎక్కడోగాని వాడడం లేదు. నిజానికి మామిడికాయ పొడి చేయడం చాలా సులువు, దాన్ని వాడడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా కలుగుతాయి. వంటల్లో చింతపండుకు బదులుగా మామిడికాయ పొడిని వాడుకోవచ్చు. పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది మామిడికాయ పొడి. మార్కెట్లో దొరుకుతున్నప్పటికీ అవి ఎలా తయారుచేశారో తెలియదు, అలాగే అందులో ఎక్కువగా ఉప్పు కలిపి అమ్ముతుంటారు. ఉప్పు కలపని మామిడికాయ పొడిని ఇంట్లోనే శుద్ధిగా తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. దీన్నే ‘ఆమ్చూర్ పౌడర్’ అని కూడా పిలుస్తారు. వేసవిలో మామిడికాయలు విరివిగా లభిస్తాయి కనుక ఇప్పుడే ఈ పొడిని చేసుకుంటే వచ్చే వేసవి వరకు నిల్వ ఉంటుంది.


చేయడం ఇలా...
ఆకుపచ్చటి మామిడికాయల్ని ఎంచుకోవాలి. ఈ పచ్చి మామిడికాయల తొక్కను ఒలిచేయాలి. మిగతా కాయని నిలువుగా, సన్నగా కోసుకోవాలి. వాటిని ఎర్రటి ఎండలో ఎండబెట్టుకోవాలి. దాదాపు నాలుగైదు రోజులకు అవి బాగా ఎండిపోతాయి. ముదురు రంగులోకి మారిపోతాయి. చిప్స్ లా మారిన వాటిని మిక్సీలో వేసి మెత్తడి పొడిలా చేసుకుని, గాలి చొరబడని కంటైనర్లలో భద్రపరుచుకోవాలి. దీన్ని చింతపండుకు, టమాటాలకు బదులుగా వాడుకోవచ్చు. పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. కూరల్లో చల్లుకుంటే మంచి రుచి వస్తుంది.


ఆరోగ్య ప్రయోజనాలు
1. మామిడికాయలో ఉన్న లక్షణాలన్నీ ఈ పొడిలో ఉంటాయి. ఇంకా అదనంగా కూడా లభిస్తాయి. 
2. మామిడికాయ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. 
3. మధుమేహులకు ఇది చాలా మేలు చేస్తుంది. షుగర్‌ను అదుపులో ఉంచుతుంది.  మనం తిన్న ఆహారం నుంచి గ్లూకోజు అధిక స్థాయిలో ఒకేసారి విడుదలై, రక్తంలో కలవకుండా అడ్డుకుంటుంది. అందుకే మామిడి కాయ పొడి మిగతావారిలో పోలిస్తే మధుమేహులు ఎంతో మంచిది. 
4. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఈ పొడి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 
5. దీనిలో మ్యాగ్నిఫెరిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది. 
6. మామిడికాయ పొడి గుండెకు ఎంత బలం. భవిష్యత్తులో గుండె పోటు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
7. మహిళలకు ఇది చాలా అవసరం. వారిలోనే రక్త హీనత సమస్య కనిపిస్తుంది. కాబట్టి ప్రతి కూరలో ఈ పొడిని చల్లుకుని తింటే ఆ సమస్య దూరమవుతుంది. దీనిలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తం ఉత్పత్తి అవుతుంది. 
8. మామిడికాయ పొడి జీర్ణ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. 


Also read: వేసవిలో చద్దనాన్ని మించిన ఔషధం లేదు తెలుసా? తింటే ఎన్నో లాభాలు


Also read: డయాబెటిస్ ఉన్నవారు అవి తింటే, క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ