పూర్వకాలంలో బ్రేక్‌ఫాస్ట్ అంటే చద్దన్నమే. అది తింటేనే కష్టమైన పొలం పనులు చురుకుగా చేయగలిగేవారు. ఇప్పుడు చద్దన్నం తినే వాళ్లు ఎక్కడో మారుమూల గ్రామాల్లో తప్ప ఏ పట్టణం, నగరాల్లో కనిపించడం లేదు. జీవనవిధానం మారిపోవడం, వెస్ట్రన్ కల్చర్ పెరగడంతో రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు తినడం అలవాటైంది. వాటితో సమస్యలే తప్ప ఆరోగ్యానికి ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు వేసవిలో అలాంటి అలవాట్ల వల్ల ఆరోగ్యానికి దెబ్బే. అందుకే వారానికి మూడు రోజులైనా చద్దన్నం తింటే చలువ చేస్తుందని చెబుతున్నారు పెద్దలు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే కోవిడ్ సోకినప్పుడు కొంతమంది చద్దన్నాన్ని కూడా తినడం ప్రారంభించారు.
ఎన్ని లాభాలో
1. రాత్రంతా మజ్జిగలో పులుస్తుంది అన్నం. అందులో పొట్ట ఆరోగ్యానికి అవసరమైన మంచి బ్యాక్టిరియా పుడుతుంది. దీన్ని తింటే పొట్ట, పేగులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.
2. వేడి చేసిందని చెబుతుంటారు చాలా మంది, అలా వేడి చేయకుండా ఉండాలంటే చద్దన్నం తినడం అలవాటు చేసుకోవాలి.
3. చద్దన్నంలో శరీరానికి అవసరమయ్యే ఐరన్, పొటాషియం, కాల్షియం, లభిస్తాయి. ఐరన్ వల్ల రక్త హీనత సమస్య దరి చేరదు.
4. హైబీపీ ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.
5. మానసిక సమస్య అయిన యాంగ్జయిటీ చద్దన్నం తినడం వల్ల తగ్గుతుంది.
6. చర్మ వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.
7. వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి చర్మానికి, శరీరానికి ఇస్తుంది. చద్దన్నం తింటే అంత త్వరగా వడదెబ్బ బారిన పడరు.
8. చద్దన్నం తినడం ఆకలి త్వరగా వేయదు. నీరసం కూడా రాదు.
9. పొట్టలో అల్సర్లు రాకుండా కాపాడుతుంది.
చద్దన్నం ఇలా..
రాత్రి వండుకున్న అన్నం మిగిలిపోతుంది. ఆ అన్నాన్ని ఒక లోతైన గిన్నెలో వేసి మజ్జిగ వేసి నానబెట్టాలి. ఉదయానికి అది చద్దన్నం అవుతుంది. తినేముందు ఆ అన్నం కాస్త పెరుగు కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. మిరపకాయ లేదా పచ్చి ఉల్లిపాయ నంజుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయ తిన్నా బావుంటుంది. చద్దన్నం కోసం ఒక రాత్రి నానబెడితే చాలు. అంతకుమించి నానబెడితే పాడైపోతుంది. ఈ ఎండల్లో మీకు చద్దన్నమే దివ్యౌషధం.
Also read: డయాబెటిస్ ఉన్నవారు అవి తింటే, క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ
Also read: రోజుకో చిన్నముక్క పల్లీ చిక్కీ తింటే మహిళలు, పిల్లల్లో ఆ సమస్య దూరం
Also read: ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మొటిమలు రావు, ఈ సమస్య ఎంతమందిని వేధిస్తోందో తెలుసా?