ఆస్కార్ వేదికపై హాలీవుడ్ హీరో విల్‌స్మిత్, కమెడియన్ క్రిస్‌ను చెంపదెబ్బ కొట్టిన ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. విల్‌స్మిత్ కు ఎందుకంత కోపం వచ్చిందో తెలుసా? విల్ స్మిత్ భార్య జడా ‘అలోపేషియా’ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. దాని వల్ల ఆమె జుట్టు మొత్తం ఊడిపోయి గుండులా అయింది. ఆమె లుక్స్ పైనే క్రిస్ జోక్ వేశాడు. దానికి జడా ఫీలైనట్టు వీడియోలోనే కనిపిస్తోంది. దీంతో విల్ స్మిత్ వేదిక మీదకు వెళ్లి క్రిస్‌కు గట్టిగా ఒక్కటిచ్చాడు. ఈ ఘటనతో ఇప్పుడు ఆమెకున్న ఆరోగ్య సమస్య ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అలోపేషియా ఎందుకొస్తుందో? ఎవరికి వస్తుందో? చికిత్స ఏంటో తెలుసుకోండి. 







ఏంటి అలోపేషియా?
ఈ ఆరోగ్యపరిస్థితి పేరు ‘అలోపేషియా అరేటా’. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వెంట్రుకల ఫోలికల్స్ పై దాడి చేస్తుంది. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడం అసాధారణంగా ఉంటుంది. గుండ్రని పాచెస్‌లా ఊడి చేతికొస్తుంది. జుట్టు లేకుంటే ముఖం అందవికారంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆరోగ్యసమస్య ఉన్నవారి మిగతా శరీర భాగాల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించదని చెబుతోంది అమెరికా ఆరోగ్య శాఖ. 


కారణమేంటి? 
అలోపేసియా అరేటా ఎందుకొస్తుందో వైద్యులు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.ఇది రావడానికి జన్యుపరమైన, పర్యావరణపరమైన కారకాలు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.  రోగనిరోధక వ్యవస్థ పొరపాటున హెయిర్ ఫోలికల్స్ పై దాడి చేసి, అక్కడ వాపుకు కారణమవుతుందని చెబుతున్నారు వైద్యులు. 


ఇది మూడు రకాలు
అలోపేషియా అరెటా వచ్చిన వారిలో జుట్టు ఊడిపోయే పద్ధతి మూడు రకాలు. 


 ప్యాచీ: గుండ్రని ప్యాచెస్‌లా జుట్టు రాలిపోతుంది. స్నానం చేస్తున్నప్పుడు మరీ రాలిపోతుంది. జుట్టు ఊడిన చోట నాణెం ఆకారంలో ప్యాచెస్ ఉంటాయి. 


టోటాలిస్: ఈ రకం వచ్చిన వ్యక్తుల్లో జుట్టు మొత్తం ఊడిపోయి గుండులా తయారవుతుంది. 


యూనివర్సాలిస్: ఇది చాలా అరుదైన రకం. చర్మం, ముఖం, ఇతర శరీరభాగాలపై ఉన్న జుట్టు కూడా మొత్తం రాలిపోతుంది. 


చికిత్స ఇలా..
అతిగా స్పందిస్తున్న రోగనిరోధక వ్యవస్థను అణిచివేసేందుకు మందులు ఇస్తారు. ఇవి అధికంగా ఇంజెక్షన్ల రూపంలో ఉంటాయి. కొన్ని క్రీములు కూడా ఇస్తారు. కార్టికోస్టెరాయిడ్స్ వంటి మందులు కూడా సూచిస్తారు. శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ ఇంజెక్షన్లను కూడా ఇస్తారు. ఎప్పటికీ ఈ ఆరోగ్యసమస్య దారికొస్తుందో మాత్రం చెప్పలేం. 





Also read: మధుమేహం ఉన్నవాళ్లు వేసవిలో తినాల్సిన పండ్లు ఇవే


Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు