People Hang Blue Bottles Outside Of Their Houses: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్‌గా మారింది. ఇది కచ్చితంగా నిజం అని కొంతమంది భావిస్తుంటే.. ఇదంతా మూఢనమ్మకం అంటూ మరికొంతమంది వాదిస్తున్నారు. ఇంకొత మంది దీనికి లాజిక్స్ కూడా వెతుకుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. గత కొద్ది రోజులుగా చాలా మంది తమ ఇళ్ల బయట నీలి రంగు బాటిళ్లను వేలాడదీయడం తాజాగా నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. నీళ్లలో నీలి రంగు (Blue Bottle) కలిపి ఆ ద్రావణాన్ని ప్లాస్టిక్ బాటిల్‌లో నింపి ఇంటి బయట తలుపులు లేదా గోడకు వేలాడదీస్తున్నారు. ఇలా చేస్తే ఈ నీలం రంగు కారణంగా కుక్కలు ఇంటి దగ్గరకు రావని చాలామంది నమ్ముతున్నారు.
అసలు ఎందుకిలా.?
నీలి రంగు కుక్కలను దూరంగా ఉంచుతుందని చాలా మంది భావిస్తున్నారు. కుక్కలు ఇతర రంగుల కంటే నీలం రంగును స్పష్టంగా చూడగలవని.. అందుకే అక్కడ కొంత ప్రమాదం ఉందని భావించి దగ్గరకు రావని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇంటి బయట మురికి, దుమ్ము, దూళి ఉండదని.. కుక్కల బెడద చాలా వరకూ తగ్గిందని భావిస్తున్నారు. ఇదే సరైన ఉపాయమని భావించి నీలి రంగు బాటిళ్లను ఇంటి బయట వేలాడదీస్తున్నారు. ఇప్పుడిదే ట్రెండింగ్‌గా మారింది.
అసలు సైన్స్ ఏం చెబుతోంది.?
కుక్కలకు నీలి రంగు ఎక్కువగా కనిపిస్తుందని, ఇది వాటికి ప్రమాద సూచిక అని, దీని వల్లే అవి ఇంటి దగ్గరకు రావని ప్రజలు అంటున్నారు. అయితే, సైంటిఫిక్ పరంగా చూస్తే అసలు కుక్కలకు రంగు అంధత్వం ఉందని తెలుస్తోంది. అంటే, అవి రంగుల మధ్య తేడాను గుర్తించలేవు. దీని ప్రకారం నీలి రంగు సీసాలను ఇంటి బయట వేలాడదీయడం వల్ల అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయన్న వాదనకు శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది ఎరుపు రంగు సీసాలను సైతం వేలాడదీస్తున్నారని.. ఇది వృథా ప్రయాస అని పేర్కొంటున్నారు. ఎరుపు లేదా నీలం రంగు వేలాడదీసినంత మాత్రాన కుక్కలు దగ్గరకి రావు అనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేస్తున్నారు.