Batukamma Festival Stories: గుట్టలు, గట్లు, చేలు, అడవి..ఇలా ఎక్కడెక్కిడి నుంచో ఏరితీసుకొచ్చి పూలను ఓ చోట అందంగా పేర్చి బతుకునిచ్చే బతుకమ్మగా భావించి పూజిస్తారు. అదే బతుకమ్మ పండుగ.
అందరూ బతుకమ్మలను ఒకేలా పేరుస్తారు కానీ చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది. కొందరు శివలింగంలా పేరిస్తే..మరికొందరు బౌద్దుల స్థూపాకారంలో పేర్చుతారు.
అప్పట్లో బౌద్దులు..మత ఆరాధానలో భాగమైన స్తూపాలును పూలు, మట్టి, ఇసుక, రాళ్లుతో తయారు చేసుకుని పూజించేవారట. ఎందుకంటే వీళ్లు నిత్యం ప్రయాణాల్లో ఉండడంతో సమయానుకూలంగా అక్కడ తమకు అందుబాటులో ఉన్న వస్తువులతో స్తూపం తయారుచేసుకునేవారు. బుద్ధుడికి ప్రతీకగా స్తూపానికి నమస్కరించి..ఆ తర్వాత ఆ సమీపంలో ఉండే నీటిలో కలిపేవారు. అలా వాళ్లు తిరిగిన ప్రదేశాల్లో తెలంగాణ ఒకటి.
Also Read: బతుకమ్మ పండుగ డేట్స్ 2024 ...ఈ రోజు ఏ బతుకమ్మని పూజించాలి!
బౌద్దులు స్తూపాలుగా పూలను పేర్చడం చూసి గిరిజనులు వీరిని అనుకరించడం మొదలుపెట్టారు. రంగు రంగు పూలను స్తూపంలా పేర్చి వనదేవతను పూజించిన తర్వాత అమ్మవారి కరుణాకటాక్షాలు లభించాయట. అప్పటి నుంచీ ఈ బౌద్ద స్తూపాకారంలో పూలను పేర్చి పూజించడం ప్రారంభించారు.
ఆశ్వయుజమాస పాడ్యమి నుంచి దసరా ప్రారంభం అయితే..అందుకు ఓ రోజు ముందు వచ్చే భాద్రపద అమావాస్య/మహాలయ అమావాస్య/పితృ అమావాస్య నుంచి బతుకమ్మ ప్రారంభమవుతుంది. అంటే శక్తి తో పాటూ పితృదేవతలను తలుచుకోవడం కూడా ఈ పండుగ ఆంతర్యం.
బతుకమ్మ వేడుకలలో భాగంగా తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని 2 బతుకమ్మలను పేరుస్తారు. స్త్రీలో మాతృత్వ కోణం అనువణువునా ఈ పండుగలో కనిపిస్తుంది. ఆడబిడ్డలకు పుట్టింటితో అనుబంధం..తోబుట్టువులతో మగపిల్లల ఆప్యాయత అన్నీ బతుకమ్మలో కనిపిస్తాయి. అందంగా పేర్చిన బతుకమ్మ బతుకునిచ్చే అమ్మలా దీవిస్తున్నట్టుంటుంది.
బతుకమ్మ సంబరాలను తెలంగాణ నేలపై శతాబ్ధాలుగా జరుపుకుంటున్నారు...ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పేందుకు ఎన్నో కథలున్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనాన్ని భరించలేక తెలంగాణ గ్రామీణ మహిళల ఆత్మహత్యలు చేసుకునేవారు. వారందర్నీ తలుచుకుంటూ...వారికి గుర్తుగా రంగురంగుల పూలను పేర్చి..మధ్యలో శక్తి రూపాన్ని పెట్టి బతుకమ్మ అంటూ పూజించడం ప్రారంభించారు.
Also Read: బతుకమ్మకు ఏ రోజు ఏ నైవేద్యం పెడతారో తెలుసా? రెసిపీలు ఇవే
కాకతీయ రాణి రుద్రమదేవి తన మనవళ్లకు అనారోగ్యం కలిగినప్పుడు బతుకమ్మ పండుగ చేయడం ద్వారా వంశాన్ని కాపాడుకుందని.. అప్పటి నుంచి బతుకమ్మ వైభోగంగా జరుగుతోందని చెబుతారు.
ఓ దంపతులకు పిల్లలు పుట్టినట్లే పుట్టి చనిపోతుంటే.. గౌరమ్మను పూజించారు. అప్పుడు జన్మించిన బిడ్డకి బతుకమ్మ అని పేరు పెట్టారు. అందుకే ఆడబిడ్డకు ప్రతీకగా పూలను పేర్చి..ఆ బిడ్డను ప్రసాదించిన గౌరమ్మను మధ్యలో పెట్టి పూజించారని మరో కథ..
పరమేశ్వరుడు తలపై ఉన్న గంగని చూసి పార్వతీ దేవి అసూయ చెందిందట. అందరూ గంగనే పూజిస్తున్నారని తల్లితో చెప్పిందట. అప్పుడు ఆ గంగమ్మపై నిన్ను పూల తెప్పలా తేలించి పూజిస్తారని మాట ఇచ్చిందట. అలా బతుకమ్మ వేడుక వెనుక మరో కథ చెబుతారు.
పూర్వం పిల్లలు లేని దంపతులు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుండగా వారికి ఓ బిడ్డ దొరికింది. ఆ చిన్నారిని అమ్మవారి ప్రసాదంగా భావిస్తూ పెంచుకున్నారని.. ఆమె ఎన్నో మహిమలు చూపడంతో అందరూ దేవతగా భావించారని ..ఆమే బతుకమ్మ అని మరో కథ..
జానపదుల పండుగగా ప్రారంభమైన బతుకమ్మ నగరాలకు..ఆ తర్వాత సరిహద్దులు దాటి విదేశాలకు పాకింది. తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ జరుపుకోవడం మాత్రం మానేయరు. వారి జీవితాల్లో బతుకమ్మ అంతలా భాగమైపోయింది. సంతోషాన్ని - బాధను పాటల రూపంలో బతుకమ్మకి చెప్పుకుంటారు..ఆమె కదా అందరకీ అమ్మ...
Also Read : బతుకమ్మ పూలలో ఎన్ని ఔషధగుణాలు ఉంటాయో తెలుసా? ఈ పండుగ ఆనందానికే కాదు ఆరోగ్యానికి కూడా