Tirupati News: తిరుమల శ్రీవారి పరమపవిత్రమైన లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని టీటీడీ ప్రకటించిన తరువాత తదుపరి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కేసు నమోదు చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
తిరుమల ఆలయంలో వినియోగించే నెయ్యిని కాంట్రాక్టర్ నుంచి తొలుత తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గొదాముల్లోకి చేరుతుంది. ఇక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించి అన్ని బాగుంటేనే తిరుమలకు అనుమతిస్తారు. తిరుమలకు చేరిన తరువాత కూడా అక్కడ పరీక్షలు నిర్వహించి బాగుందని నిర్థారణ అయ్యాక వినియోగిస్తారు. ఇలా ప్రాథమిక పరీక్షలు జరిగిన వాటిలో తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందించిన నెయ్యిలో నాలుగు ట్యాంకులు నాసిరకంగా ఉన్నాయని గుర్తించి వాటిని తిరిగి పంపేసారు. ఆ తర్వాత శ్యాంపుల్ తీసి ఎన్డీడీబీకి పరీక్షల కోసం పంపారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. దీనిపై వివాదం జరిగిన తరువాత ఇన్ని రోజుల తర్వాత టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ బుధవారం పోలీసులు ఫిర్యాదు చేశారు.
కేసులోని అంశాలు
కాంట్రాక్టర్లు ఇస్తున్న నెయ్యి నాసిరకంగా ఉందని గుర్తించి వారికి వార్నింగ్ ఇచ్చారు. అందరూ మారిన తమిళనాడు ఏఆర్ డైరీ ఫుడ్ వాళ్ల తీరు మారకపోవడంతో నాసిరకంగా ఉన్న వాటిని పంపివేసి ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ తరువాత నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె, కూరగాయల నూనెలు ఉన్నట్లు గుర్తించారు. టీటీడీ ఈవో శ్యామల రావు ఫిర్యాదు మేరకు తమిళనాడు రాష్ట్ర అధికారులు సంస్థలో తనిఖీలు చేసారు. అక్కడ కొన్ని శ్యాంపుల్స్ తీసి ఢిల్లీలోని FSSI ల్యాబ్‌కు పంపారు. అయితే తమ సంస్థలో ఎలాంటి కల్తీ నెయ్యి లేదని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఢిల్లీ ల్యాబ్ మాత్రం ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
టీటీడీ కూడా కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది. వచ్చిన రిపోర్టుల ఆధారంగా టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సంస్థపై ఫిర్యాదు చేశారు. మార్కెటింగ్ గోదాము తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఫిర్యాదు చేశారు.
త్వరలో అరెస్టులు!
టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్ మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పై సెక్షన్ 274 ఆహార కల్తీ, 275 కల్తీ అయిన వస్తువులు అమ్మకం, 316(5) ఒప్పంద నమ్మకాన్ని వమ్ము చేయడం, 318(3) మోసం చేయడం, 318(4) మోసపూరితమైన అమ్మకాలు చేయడం, 61(2) ఒప్పందాలు వమ్ము చేయడానికి అగ్రిమెంట్ చేసుకునే ఉద్దేశం, 299 మనోభావాలు దెబ్బ తీయడం, 3(5) అందరికీ నేరాన్ని ఆపాదించడంతో పాటు మోసపూరితంగా నేరాన్ని ప్రోత్సహించినందుకు కేసు నమోదు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులను త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉంది.
Also Read: ముస్లిం భక్తుడు సమర్పించిన బంగారు పూలతోనే దశాబ్ధాలుగా శ్రీవారికి అష్టదళ పద్మారాధన సేవ!