26 September Weather Report: ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇది గుర్తించే స్థాయిలో లేకపోయినా  ప్రభావం మాత్రం ఉంటోంది. దీంతోపాటు దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉంది.


దీని ప్రభావంతో  ప్రస్తుతం మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో  వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్‌ తెలుగు రాష్ట్రాలపై కూడా ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఏపీ, తెలంగాణ, బిహార్, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ముంబై, పూణేతో సహా అనేక ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే జోరు వానలు పడుతున్నాయి. బలమైన గాలులు వీస్తున్నాయి.  






 


తెలంగాణలో వాతావరణం(Telangana Weather Report)


బంగళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులు కారణంగా తెలంగాణ(Telangana Weather Report)లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్ష పాతం నమోదు కావచ్చని తెలిపింది వాతావరణ శాఖ. బుధవారం వరకు వారం రోజులకు సంబంధించిన వెదర్ రిపోర్టును వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. ఆ వివరాలు పరిశీలిస్తే ఇవాళ రేపు మాత్రమే వర్షాలు పడబోతున్నాయి. తర్వాత ఐదు రోజులు అక్కడక్కడ జల్లులు, తుంపర్లు తప్ప పెద్దగా వర్ష ప్రభావం లేదని అధికారుల వెల్లడించారు. 


భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు:- భూపాలపల్లి, కామారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాల ప్రజలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 



ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే జిల్లాలను కూడా అధికారులు వెల్లడించారు. అవి ఆదిలాబాద్‌, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డిలో తేలికపాటి వర్షాలతోపాటు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.  


హైదరాబాద్‌ వాతావరణం (Hyderabad Weather Report)
హైదరాబాద్‌ వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉంటే గరిష్ఠ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉంటుందని అంచనా వేశారు. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు ఉంటే.. కనిష్ట ఉష్ణోగ్రత 23.9 డిగ్రీలుగా నమోదైంది. 



ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం (Andhra Pradesh Weather Report)
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అన్ని మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం బలహీన పడి ఆవర్తనం కంటిన్యూ అవుతున్నందున అక్కడక్కడ వర్షాలు పడే అవకాశమైతే ఉందని చెబుతున్నారు. అందుకే అన్ని జిల్లాల్లో ఇవాళ రేపు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.