Bathukamma Naivedyalu 2024 : బతుకమ్మను తొమ్మిదిరోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఒక్కోరోజు ఒక్కో నైవేద్యాన్ని అమ్మవారికి పెడతారు. ఇంతకీ ఏయే నైవేద్యాలను అమ్మవారికి పెడతారో.. ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంగిలిపూల బతుకమ్మ (మొదటిరోజు)
బతుకమ్మలో మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను చేస్తారు. ఈరోజు అమ్మవారికి నువ్వులతో నైవేద్యం పెడతారు. నువ్వులను పొడి చేసి.. దానిలో పంచదార వేసి కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
అటుకుల బతుకమ్మ (రెండోరోజు)
బతుకమ్మను రెండోరోజు అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. ఆరోజు పేరుకు తగ్గట్లుగానే అటుకులతో నైవేద్యం చేస్తారు. బియ్యం అటుకులను రెండు నిమిషాలు నీటిలో నానబెట్టాలి. అనంతరం అటుకులను నీటినుంచి తీసేసి ఓ గంట ఎండనివ్వాలి. దానిలో యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు ఓ పాన్ తీసుకుని స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. దానిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. వాటిని పక్కకు తీసి దానిలో బెల్లం తురము వేయాలి. అది పాకంగా మారిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. దానిలో అటుకులు వేసి కలపాలి. అంతే అటుకుల నైవేద్యం రెడీ. కొందరు చప్పిడి పప్పు కూడా పెడతారు.
ముద్దపప్పు బతుకమ్మ (మూడోరోజు)
మూడోరోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. కందిపప్పును బాగా కడిగి.. ప్రెజర్ కుక్కర్లో వేయాలి. దానిలో కందిపప్పు, నీళ్లు, దంచిన జీలకర్ర, కరివేపాకు, నూనె, పసుపు, వేసి ఉడికిస్తారు. అనంతరం కుక్కర్లో ప్రెజర్ పోయిన తర్వాత దానిలో రుచికి తగ్గ పప్పు వేసుకుని నైవేద్యంగా పెడతారు.
నానబియ్యం బతుకమ్మ (నాలుగోరోజు)
నాలుగోరోజు చేసే బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ అంటారు. ఆరోజు నైవేద్యంగా బెల్లం పరమాన్నం చేస్తారు. పాలల్లో బియ్యాన్ని ఉడికించాలి. దాదాపు ఉడికిపోనివ్వాలి. ఇప్పుడు మరో గిన్నెలో బెల్లం సిరప్ చేసుకోవాలి. ఈ రెండింటీని మీడియం మంటమీద అన్నం, బెల్లం పాకాన్ని కలపాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకుని వాటిని పాయసంలో కలుపుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసుకుని దించేయాలి.
Also Read : సింపుల్‌గా, టేస్టీగా చేసుకోగలిగే కుక్కర్ పాయసం రెసిపీ
ఐదో రోజు అట్ల బతుకమ్మ
బతుకమ్మలో ఐదో రోజును అట్ల బతుకమ్మ అంటారు. ఆరోజు బియ్యం పిండితో అట్లు వేసి నైవేద్యంగా పెడతారు. అయితే దోశల పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కూడా వేసి కలిపి దోశలు వేసి నైవేద్యంగా పెడతారు.
అలిగిన బతుకమ్మ (ఆరో రోజు)
బతుకమ్మలో ఆరో రోజును అలిగిన బతుకమ్మగా చేసుకుంటారు. అయితే ఈరోజు అమ్మవారి అలిగినట్లు భావిస్తారు. ఆరోజు బతుకమ్మ ఆడరు, నైవేద్యాలు చేయరు.
వేపకాయల బతుకమ్మ (ఏడు రోజు)
ఏడోరోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మగా పిలుస్తారు. ఆరోజు నైవేద్యంగా సకినాల పిండితో వేపకాయలు చేస్తారు. వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
వెన్నముద్దల బతుకమ్మ (ఎనిమిదో రోజు)
బతుకమ్మలో ఎనిమిదో రోజును వెన్నముద్దల బతుకమ్మగా చేస్తారు. ఆరోజు అమ్మవారికి వెన్నముద్దలు చేసి పెడతారు. ముందుగా ఓ గిన్నెలో బియ్యం పిండి, నెయ్యి నీళ్లు వేసి బాగా కలుపుతారు. వాటితో ఉండలు చేస్తారు. ఇప్పుడు స్టౌవ్‌పై పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఫ్రై చేసుకుంటారు. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి.. వాటిని బెల్లం పాకంలో వేస్తారు. వీటిని బాగా కలిపి.. సిరప్ ఉండల్లోకి వెళ్లిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
సద్దుల బతుకమ్మ (తొమ్మిదో రోజు)
బతుకమ్మలో చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఆరోజు నైవేద్యంగా పెరుగన్నం సద్ది, పులిహోర సద్ది చేసి పెడతారు. అలాగే మలీద లడ్డూలు కూడా చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇలా తొమ్మిదిరోజులు వివిధ నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి బతుకమ్మను ఆడతారు.
Also Read : బతుకమ్మ పూలలో ఎన్ని ఔషధగుణాలు ఉంటాయో తెలుసా? ఈ పండుగ ఆనందానికే కాదు ఆరోగ్యానికి కూడా