Tirumala Brahmotsavam 2024: వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన నక్షత్రం శ్రవణం..మాసం ఆశ్వయుజం. అందుకే ఏటా శరన్నవరాత్రుల్లో ఓ శుభముహూర్తంలో చక్రస్నానానికి తొమ్మిది రోజుల ముందు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.


వెంకటాచలంలో వెలసిన వేంకటేశ్వరుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలనిచెప్పారు. దేవదేవుడి ఆదేశం మేరకు బ్రహ్మదేవుడు శ్రవణం నక్షత్రం నాటికి ఉత్సవాలు పూర్తయ్యేలా తొమ్మిదిరోజుల పాటూ తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడంతో..బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మదేవుడు నిర్వహించిన ముహూర్తం ప్రకారం...ఆశ్వయుజమాసంలో శ్రవణం నక్షత్రం నాటికి తొమ్మిదిరోజుల ముందు నుంచీ శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగడం ఆనవాయితీగా మారింది. 


Also Read: తిరుమలలో మహాశాంతి హోమం..హోమాలతో దోషాలుపోతాయా - యజ్ఞం, యాగం, హోమం మధ్య వ్యత్యాసం ఏంటి !


వైఖానల ఆగమోక్తంగా వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేయడాన్ని ..ధ్వాజారోహణం అంటారు. ఎనిమిదో రోజు మహారథం అప్పట్లో చెక్కది ఉపయోగించేవారు.. 1996 నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై శ్రీవారు ఊరేగుతున్నారు.  2012 లో ఆ స్థానంలో మరో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది


వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంకురార్పణలో మొదలవుతాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభం అయ్యేందుకు ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలో లలాట, బాహు, స్థన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఈ మట్టిని యాగశాలలో ఉన్న 9 పాలికలలో నింపి నవధాన్యాలు పోస్తారు. శుక్ల పక్ష చంద్రుడిలా అందులో పోసిన నవధాన్యాలు మొలకెత్తేలా నిత్యం నీరుపోస్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సోముడు ( చంద్రుడు) అధిపతి. అందుకే అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను మొలకెత్తించే కార్యక్రమం కాబట్టి...దీనిని అంకురార్పణ అంటారు.


Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!


అంకురార్పణ తర్వాత దేవతలను ఆహ్వానించే కార్యక్రమం ప్రారంభిస్తారు. అదే ధ్వజారోహణం. శ్రీవారి వాహనం గరుత్మంతుడు.. అందుకే ఆహ్వానం గరుడుడి ద్వారా పంపిస్తారు. ఓ నూతన వస్త్రంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని వేసి..దానిని ధ్వజస్తంభంపై ఎగరేసేందుకు నూలుతో తయారు చేసిన కొడితాడును వినియోగిస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్పస్వామి, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నం అయిన మీన లగ్నంలో సకలదేవతలకు గరత్మంతడి ద్వారా ఆహ్వానం పంపిస్తారు. ఈ ఆహ్వానం అందుకున్న ముక్కోటి దేవతలు బ్రహ్మోత్సవాలు చూసి ఆనందిస్తారని పురాణాల్లో పేర్కొన్నారు.  


ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామివారు సర్వాలంకారభూషితుడై...శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో విహరిస్తారు. ఆయన ధరించేది శేషవస్త్రం...ఆయన నిద్రించేపానుపు ఆదిశేషుడు..అందుకే శ్రీవారి వాహనసేవలు పెద్ద శేషవాహనంతో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత రోజు నుంచి రోజుకి రెండు వాహనసేవలు..ఉదయం ఒకటి.. సాయంత్రం మరొకటి జరుగుతాయి. ఆఖరి రోజు చక్రస్నానం పూర్తిచేసిన తర్వాత ధ్వజారోహణంలో భాగంగా ఎగురేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. అప్పటివరకూ స్వామివారి బ్రహ్మోత్సవాలు చూసి తరించిన దేవతలందరకి ఇది వీడ్కోలు అన్నమాట....అలా అంకురార్పణ.. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు చక్రస్నానం..ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి.....


ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి....


ఓ నమో వేంకటేశాయ


Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!