TTD Brahmotsavam 2024: ఏడాది పొడవునా గోవింద నామస్మరణతో మారుమోగే తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు టీటీడీ అధికారులు.


బ్రహ్మాండనాయకుడు స్వయంగా వైకుంఠం నుంచి దిగివచ్చే రోజులు కావడంతో ఆశ్వయుజమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అంత ప్రాధాన్యం. 


తిరుమల కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వస్వామికి నిత్యం ఏదో ఒక సేవ, ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఏటా కన్యామాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వీటినే సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారు. 


వేయ్యేళ్ల క్రితం నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పేందుకు ఎన్నో ఆధారాలున్నాయి. అప్పట్లో స్వామివారికి ఏటా పదిసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు...ఇప్పటిలా 9 రోజులు కాదు..ఏకంగా 14 రోజులు. అయితే ఇప్పటిలా శ్రీవారు మాడవీధుల్లో వాహనాలపై ఊరేగేవారు కాదు..శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం పక్కన తిరుమలరాయలు నిర్మించిన ఊంజల్ మండపంలో... వాహనాలపై ఆసీనులయ్యాక అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించేవారు


ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమై 12వ తేదీ చక్రస్నానం, ధ్వజారోహణంతో ముగుస్తాయి.


నిత్యం ఉదయం 8 నుంచి 10 వరకూ రాత్రి 7 నుంచి 9 వరకూ వాహనసేవలు జరుగుతాయి 


బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటూ 9 రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దుచేస్తారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తూనే..భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పిస్తారు..
 
అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన జరుగుతుంది


Also Read: తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!


మొదటి రోజు


అక్టోబర్ 4వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం 3:30  నుంచి సాయంత్రం 5:30  వరకు బంగారు తిరుచి ఉత్సవం,  6 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు   శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఏడుతలల శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.


రెండో రోజు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజున అక్టోబర్ 5వ తేదీ శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి చిన శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు . పెద శేష వాహనం ఆదిశేషుడు అయితే..చిన శేషవాహనాన్ని వాసుకిగా చెబుతారు. ఇదే రోజు రాత్రి హంసవాహనంపై దర్శనమిస్తారు శ్రీవారు.


మూడో రోజు 


అక్టోబర్ 6వ తేదీ ఆదివారం ఉదయం సింహ వాహనంపై  భక్తులకు దర్శనమిస్తాడు మలయప్పస్వామి.  సింహం బలానికి, వేగానికి ప్రతీక అని చెబుతూనే  మనుషులు తమలో జంతు ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని చెప్పడమే ఈ వాహనం ఉద్దేశం. ఇదే రోజు సాయంత్రం ముత్యపు పందిరిలో మాడ వీధుల్లో విహరిస్తారు స్వామివారు. ముక్తిసాధనకు స్వచ్ఛమైన మనసు కావాలన్నది ఈ వాహనసేవ ఆంతర్యం.


Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!
 
నాలుగో రోజు


అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఉదయం సర్వాలంకార భూషితుడై కల్పవృక్ష వాహనంలో మాడ వీధుల్లో విహరిస్తారు స్వామివారు. క్షీర సాగర మధనంలో ఉద్భవించిన  కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలిస్తుంది..కానీ శ్రీవారు తన భక్తులకు అడగకుండానే వరాలు ప్రసాదిస్తాడు.   ఇదే రోజున రాత్రి  లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని చెబుతూ సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. అహంకారాన్ని తొలగించి శాశ్వత ఫలాన్ని ఇస్తుంది ఈ వాహన సేవ దర్శనం.


ఐదో రోజు


అక్టోబర్ 8వ తేదీ ఐదో రోజు మంగళవారం ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిస్తాడు మలయప్పస్వామి. శివుడిని సైతం సమ్మోహనపరిచి క్షీరసాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచేలా చేసిన అవతారం ఇది. మంచి పనులు చేస్తే చాలు మీకు మంచే జరుగుతుందని చెప్పడమే ఈ అవతారం ఉద్దేశం. ఇదే రోజున రాత్రి గరుడ వాహన సేవ జరగనుంది. తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు స్వామివారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని చాటిచెప్పే సేవ ఇది. 
 
ఆరో రోజు


అక్టోబర్ 9వ తేదీ బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు స్వామివారు ఉదయం హనుమంత వాహనంలో శ్రీరాముని అవతారంలో దర్శనమిస్తాడు.  రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని చెప్పడమే ఈ వాహనసేవ ఆంతర్యం. ఇదే రోజు  సాయంత్రం గజవాహన సేవ జరుగుతుంది. గజేంద్రమోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడినట్టే శరణు కోరిన వారిని కాపాడుతానని చెప్పడమే ఈ వాహనసేవ ఆంతర్యం.
 
ఏడో రోజు


అక్టోబర్ 10వ తేదీ ఏడో రోజు గురువారం ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారధిగా ఎర్రటి పూలమాలలు ధరించి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగులు పంచే సూర్యభగవానుడికి తానే ప్రతిరూపం అని చెప్పడమే ఈ వాహనసేవ ఆంతర్యం. ఇదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణం, చంద్రుని చల్లదనం..రెండూ తన అంశలే అన చెప్పడమే ఈ వాహనసేవ ఉద్దేశం. 


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
 
ఎనిమిదోరోజు 


అక్టోబర్ 11వ తేదీ ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం...గుర్రాల్లాంటి ఇంద్రియాలను తాడుతో కట్టి రథం లాంటి శరీరాన్ని, రథికుడైన ఆత్మ ద్వారా అదుపుచేయాలని రథోత్సవం ద్వారా తెలియజేస్తారు స్వామివారు. ఈ సేవలో పాల్గొన్నవారికి పునర్జన్మ ఉండదు.  ఇదే రోజు రాత్రి అశ్వవాహనంపై దర్శనమిస్తారు స్వామివారు. కలియుగాంతంలో శ్రీ మహావిష్ణువు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశ్యం. 


తొమ్మిదో రోజు


అక్టోబర్ 12వ తేదీ...బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం ఉదయం  6 గంటల నుంచి 9 గంటలకు చక్నస్నానం జరుగుతుంది. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఇదే రోజు రాత్రి  8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు, తిరుమల అప్ డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....