తడు భార్యను హత్య చేయబోయాడు. కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడికి చేయి తెగింది. కానీ, అతడికి కాసుల వర్షం కురిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.17 లక్షలు అతడికి పరిహారంగా లభించింది. అదేంటీ.. భార్యను హత్య చేయబోయిన అతడికి శిక్ష పడాలి గానీ.. ఇలా పరిహారం ఇస్తారా? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారు కదూ. అతడికైతే శిక్ష పడింది. మరోవైపు హత్యాయత్నం సమయంలో గాయపడినందుకు హాస్పిటల్ నుంచి పరిహారం కూడా లభించింది. అయితే, ఈ పరిహారం అంత ఈజీగా లభించలేదు. తెగిన చేయికి సరైన వైద్యం చేయలేదంటూ.. అతడు హాస్పిటల్ వేసిన దావాపై అనేకసార్లు పోరాడి మరీ సాధించుకున్నాడు. 


36 ఏళ్ల డోరినెల్ కొజాను 2015లో తన భార్య డనియెల్లా(35)పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాగిన మైకంలో కిచెన్‌లో ఉన్న ఎనిమిది ఇంచుల కత్తితో ఆమెను దారుణంగా పొడించాడు. దీంతో ఆమెకు పక్క టెముకులు, కుడి వైపు రొమ్ము, ఊపిరితీత్తులు, కాలేయానికి గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్‌లో చేరిన ఆమెను వైద్యులు రక్షించారు. తీవ్రమైన గాయాల వల్ల ఆమె సుమారు నాలుగు నెలలు హాస్పిటల్‌లోనే చికిత్స పొందాల్సి వచ్చింది. ఈ కేసును విచారించిన కోర్టు కొజానుకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 


ఈ ఘటనలో కొజాను కూడా గాయపడ్డాడు. అతడి కుడి చేతి రెండు వేళ్లకు లోతుగా గాయాలయ్యాయి. దీంతో అదే రోజు అతడిని NHS హాస్పిటల్‌లో చేర్చారు. వైద్యులు వెంటనే అతడికి సర్జరీ చేయాలని తెలిపారు. కానీ, తనకు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వలేదని కొజాను పేర్కొన్నాడు. అతడు తన హత్యాయత్నం కేసుకు బదులుగా.. హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఆ హాస్పిటల్‌పై దావా వేశాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తాను కుడిచేయి కదపలేని పరిస్థితి వచ్చిందని, ఇందుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే, హాస్పిటల్ మాత్రం.. అతడు తన భార్యను హత్యచేయబోయే క్రమంలో గాయపడ్డాడని, అలాంటి వ్యక్తికి పరిహారం ఎలా చెల్లిస్తామని వాదించారు.


మే 2021న ఈ కేసును విచారించిన నార్విచ్ కౌంటీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తి రికార్డర్ గిబ్సన్ కోజానుకు 8,500 పౌండ్లు (రూ.8.6 లక్షలు) పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అయితే, అప్పటికీ  కోజాను పట్టువీడలేదు. మరిన్ని దావాలు వేశాడు. చివరికి ఈ కేసు హైకోర్ట్ జస్టిస్ రిట్చేకు చేరింది. ఈ కేసును విచారించిన రిట్చే.. పరిహారాన్ని రూ.17.78 లక్షలకు పెంచాలని తీర్పునిచ్చారు. ఎందుకంటే.. అతడు హాస్పిటల్‌లో చేరే సమయానికి నేరం ఇంకా రుజువు కాలేదని, ఆ సమయంలో గాయాలతో వచ్చిన వ్యక్తిని సాధారణ పేషెంట్‌గా భావించి వైద్యులు చికిత్స అందించడం కనీస ధర్మం అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఒక పౌరుడికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆ పరిహారం చెల్లించాల్సిందేనని తెలిపారు. అలాగే ఏ కారణంతో ఆ గాయమైందో నిరూపించాల్సిన అవసరం కూడా కొజానుకు లేదన్నారు. 


Also Read: చనిపోయినా వదలరు.. మూడేళ్ల తర్వాత సమాధుల నుంచి శవాలను బయటకు తీసి.. అరాచకం కాదు, ఆచారం


ఈ తీర్పుపై కొజానూ భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇది చాలా అవమానకరం, అత్యంత దారుణమైన విషయం. అతడు గృహహింసకు పాల్పడ్డాడు. నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అలాంటి వాడికి పరిహారం అందిస్తారా? అంతగా బాధపడిన నాకు కనీసం పైసా కూడా రాలేదు’’ అని తెలిపింది. ‘‘నేను దాదాపు నాలుగు నెలలు హాస్పిటల్‌లో ఉన్నాను. కానీ, నన్ను ఎవరూ పట్టించుకోలేదు. అలాంటిది నన్ను చంపబోతు గాయపడినవాడికి పరిహారం ఎలా ఇస్తారు?’’ అని ప్రశ్నించింది. ఆమె ఆరోపణలపై కొజాను స్పందిస్తూ.. ‘‘నేను కిచెన్‌లోకి వెళ్లినప్పటికే ఆమె తనని తాను పొడుచుకుంది. ఆ తర్వాత నాపై దాడి చేసింది’’ అని తెలిపాడు. 


Also Read: మీరు మారరా? చైనీసే కాదు.. ఈ దేశస్తులూ గబ్బిలాలు తినడం ఆపలేదు.. ఎందుకు తింటున్నారో తెలిస్తే షాకే!