మనశరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. జీవక్రియల్లో ముఖ్యపాత్ర వహిస్తుంది. శరీరానికి అవసరమైన మేరకు కొవ్వును నిల్వ ఉంచుతుంది. ఒక్కోసారి కాలేయం సరిగా పనిచేయనప్పుడు కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. ఈ ప్రభావం కాలేయంపై పడుతుంది. ఈ పరిస్థితినే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది రెండు రకాలు ఒకటి ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాల్ తాగడం వచ్చేది ఒకటైతే, ఆల్కహాలు తాగకపోయినా వచ్చేది రెండోది. ఫ్యాలీ లివర్ డిసీజ్‌కు చికిత్స అందకపోతే సిర్రోసిస్‌గా మారుతుంది. దీనివల్ల కాలేయం దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. సకాలంలో ఈ పరిస్థితిని గుర్తించి చికిత్స అందిస్తే ప్రమాదం తప్పుతుంది. ఈ రోగానికి సంబంధించి కొత్త లక్షణం ఇప్పుడు బయటపడింది. అరచేతులు ఎర్రగా మారడం, గులాబీ రంగులో మచ్చల్లా కనిపిస్తాయి. అలా కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు. అది కాలేయ సమస్య కావచ్చు. ఇదే కాదు ఇంకా అనేక లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
Also Read: ఉలవ పొంగనాల రెసిపీ... తింటే ఎన్నో ఆరోగ్యసమస్యలకు చెక్ పెట్టొచ్చు
1. పొట్ట పైభాగంలో అసౌకర్యంగా అనిపించడం
2. కడుపునొప్పి
3. విపరీతమైన అలసట
4. వాంతుల్లో రక్తం పడడం
5. పచ్చ కామెర్లు (కళ్లు, చర్మం పసుపుగా మారడం)
6. మలం ముదురు రంగులో విసర్జించడం
7. పొట్ట ఉబ్బడం, కాళ్లు వాపు
8. చర్మంపై దురదలు
వీటిలో మీకు ఏ లక్షణాలు కనిపించినా తక్కువ అంచనా వేయద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. కాలేయంలో కొవ్వు భారాన్ని తగ్గించడానికి వైద్యులు తాత్కాలికంగా మందులు ఇస్తారు. ఆహారంలో కూడా చాలా మార్పులు చేయమని చెబుతారు. కొవ్వు లేని ఆహారాన్ని తినడం, వ్యాయామం చేయడం, బరువు పెరగకుండా చూసుకోవడం వంటివి చాలా ముఖ్యం.
Also Read: వీటిని రోజూ తింటే పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశం... మంచి ఆహారం, వ్యాయామమే క్యాన్సర్‌ను అడ్డుకోగలవు
వీటిని తినకండి...
ఫ్యాటీ లివర్ సమస్య ఉందని అనుమానం వస్తే పాల పదార్థాలు తినడం మానివేయాలి. పాలల్లో కొవ్వు ఉంటుంది. పాలు తాగడం వల్ల శరీరంలో వాపు, కొవ్వు బాగా పెరుగుతుంది. అన్నం, బంగాళాదుంపలు, బ్రెడ్ వంటివి తినడం చాలా తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలు, గ్రీన్ టీ, ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్, చిక్కుళ్లు, బెర్రీలు, ద్రాక్షలు వంటివి తినాలి. ఆల్కహాల్ జోలికి పోకూడదు.
ఎలాంటి సమస్యా లేకపోతే...
లివర్ సమస్యలు లేనివాళ్లు కూడా కాలేయాన్ని కాపాడే ఆహారాన్ని తినాల్సిందే. ముందుస్తుగా జాగ్రత్తపడినట్టు అవుతుంది. కొవ్వు అధికంగా ఆహారాన్ని చాలా తగ్గించాలి. ఒమెగా3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇవి కాలేయంలో పేరుకున్న కొవ్వును కరిగించేస్తాయి. సాల్మన్ చేపలు, నట్స్, కోడిగుడ్లు, ఇతర చేపలు తినడం అలవాటు చేసుకోవాలి.