రోజ్‌మేరీ ఆకులను ఆహారంలోనే కాదు మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీరలాగే రోజ్‌మేరీ కూడా వంటకాలకు అదనపు రుచిని, సువాసనను అందిస్తుంది. ఇది ఔషధ మూలికల జాతికి చెందినది. ఇప్పుడు దీని గురించి ఒక అధ్భుతమైన విషయం తెలిసింది. ఇందులో ఉండే సమ్మేళనం సార్స్ కోవిడ్ 2 వైరస్‌ను నిరోధిస్తుందని తేలింది. కోవిడ్ 19 వల్ల శరీరంలో కలిగే ఇన్ఫ్లమ్మేషన్‌ను ఇది నివారిస్తుంది. ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అనే జర్నల్‌లో ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రచురించారు. రోజ్‌మేరీలో ఉండే కార్నోసిక్ యాసిడ్ కోవిడ్‌కు చెందిన స్పైక్ ప్రోటీన్, రిసెప్టర్ ప్రోటీన్ మధ్య పరస్పర చర్యను నిరోధిస్తుందని పరిశోధనలో తేలింది.
కరోనా వైరస్, అల్జీమర్స్ వ్యాధులలో క్రియాశీలకమైన, శక్తివంతమైన ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది. దానివల్లే వైరస్‌లు సులువుగా శరీరంలోపలికి చొచ్చుకెళ్తాయి. అలా ప్రవేశించకుండా అడ్డుకునే సామర్థ్యం రోజ్‌మేరీలో లభించే కార్నోసిక్ ఆమ్లంలో ఉంది. అందుకే దీన్ని తినమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ మనదేశంలో దీని వాడకం తక్కువే. పాశ్చాత్యదేశాల్లో మాత్రం కొన్ని వంటకాలకు వాడతారు.
రోజ్‌మేరీ అనేది మధ్యధరా ప్రాంతానికి చెందిన పొద. దీన్ని ఔషధాలు, కాస్మోటిక్స్ తయారీకి ఉపయోగిస్తారు. గతంలో కూడా ఈ మొక్కపై చాలా పరిశోధనలు జరిగాయి. అందులో ఇది మెదడులోని సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరుస్తుందని తేలింది. కాబట్టి రోజ్‌మేరీ అందరూ వారానికి కనీసం రెండు మూడు సార్లయినా ఆహరరూపంలో తీసుకోవడం చాలా మంచిది.
1. రోజ్ మేరీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమ్మేషన్‌ను తగ్గిస్తాయి. ఇది క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
2. రోజ్ మేరీతో టీ చేసుకుని తాగచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి వైరస్‌ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.
3. రోజ్ మేరీలో ఉండే రోస్మరినిక్, కార్నోసిక్ ఆమ్లాలు యాంటీ ట్యూమర్ లక్షణాలను కలిగిఉంటాయి. అవి లుకేమియా, రొమ్కము, ప్రొస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేస్తాయి.
4. హైబీపీ ఉన్నవారిలో కిడ్నీలు, గుండె, నరాల వ్యవస్థపై ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. రోజ్ మేరీ టీని రోజూ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
5. రోజ్ మేరీని ఏదోరకంగా ఆహారంలో మిళితం చేసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.