దేశానికి కొత్త రాజ్యాంగం కావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ విపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నిరసన దీక్షలు చేపట్టాయి. సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో  రాజ్ ఘాట్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వద్ద భీమ్ దీక్ష  చేపట్టారు. కేసీఆర్‌కు ఎందుకు ఇంత అహంకారమని సంజయ్ ప్రశ్నించారు. తప్పు చేసి సమర్థించుకునేలా  టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సామాన్య వ్యక్తి ప్రధాన మంత్రి అయ్యారంటే.. అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే అని ..ప్రధాని  స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. 


 






అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాకొద్దు, నేనే రాజ్యాంగం రాస్తా, కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తా అన్నట్టుగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.  తనను ఎవరూ ప్రశ్నించవద్దు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోయినా నన్నెవరూ నిలదీయవద్దు అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉందని మండిపడ్డారు.  అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయక పోవడానికి కారణం కూడా ఇదేనా అంటూ ప్రశ్నించారు. నేడు రాజ్యాంగం మార్చాలి అన్నాడు. రేపు జాతీయ జెండాను, జాతీయ గేయాన్ని కూడా మార్చాలని అంటారని విమర్శించారు. 


 






తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుు ఈ దీక్షలు చేపట్టాయి. బండి సంజయ్ దీక్షకు పలువురు బీజేపీ నేతలు సంఘిభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ దీక్షలు చేస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో జిల్లా, మండల కేంద్రాల్లో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట కేసీఆర్‌ దిష్టిబొమ్మలు దహనం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగం రద్దు మాటలు ఉపసంహరించుకోవాలంటూ రెండు రోజులపాటు గాంధీ భవన్‌లో నిరసన దీక్షలు చేపడతామని ప్రకటించారు. 


దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని ..దీనిపై చర్చ జరగాలని కేసీఆర్ రెండు రోజుల కిందట వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సరిగా లేదని .. అందరికీ అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన... దేశానికి కొత్త నాయకత్వం కావాలన్నారు. అందులో భాగంగా రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలు చేశారు. అయితే అది రాజకీయ దుమారంగా మారింది.