తెలంగాణాను తిరోగమనంలోకి తీసుకెళ్లేందుకు టీఆరెఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లడుతూ కేంద్ర బడ్జెట్‌లో రైతులకు మద్దతు ధరపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఆహార సబ్సిడిని లక్ష కోట్లు తగ్గించారని, గతంలో ఉపాధి హామీ పథకంతో పేదలకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీనేని తెలిపారు. మోదీ ఉపాధి హామీ పథకం నిధుల్లో కోత విధించారని, మొన్నటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా టీఆర్‌ఎస్ వ్యవహరించిందన్నారు. కేంద్రంలో అన్ని విషయాల్లో టీఆర్‌ఎస్ బీజేపీకి సహకరించిందన్నారు. ఇన్ని రోజులు టీఆరెఎస్ బీజేపీతో అంటగాగి రాష్ట్రానికి సాధించింది ఏమీ లేదని ఆరోపించారు జీవన్ రెడ్డి. కేవలం కేసీఆర్ స్వలాభం కోసం బీజేపీతో కలిసి నడిచారని ఆరోపించారు. 


రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టడంతో బీజేపీ, టీఆరెఎస్ ఇద్దరూ పాత్రధారులేనన్నారు జీవన్‌ రెడ్డి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ సాధించలేక పోయారని, విభజన హామీలను సాధించలేక పోవడం కేసీఆర్ అసమర్థతేనని కామెంట్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా సాధించలేదని, ఎక్కడ జాతీయ హోదా వస్తే తనకు వచ్చే కమిషన్లు రావని కేసీఆర్ గట్టిగా అడగలేదన్నారు జీవన్ రెడ్డి. ఇప్పుడు బీజేపీతో కేసీఆర్ ఫైట్ కేవలం నాటకమేనని భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ వచ్చిందని కేసీఆర్ మరిచారా అంటూ మండిపడ్డారు.


కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రానికి సీఎం అయ్యి ఉంటే రాష్ట్ర విభజన కూడా అంగీకరించే వారు కాదని సంచలన కామెంట్స్ చేశారు జీవన్‌ రెడ్డి. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ తొలగించేందుకు కేసీఆర్, మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.. దీని ప్రతిఫలం కేసీఆర్ అనుభవించక తప్పదన్నారు. కేసీఆర్ బడ్జెట్ లో ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదని, కేసీఆర్ దళితుల పట్ల కపట ప్రేమ నటిస్తున్నారని అన్నారు.


రాష్ట్ర పరిధిలో అమలు చేయాల్సిన రిజర్వేషన్లు అమలు చేయకుండా కేసీఆర్ ఎస్సీ,ఎస్టీ వర్గాలకు అన్యాయం చేశారని,  దీనివల్ల రెండు వేల మెడికల్ సీట్లు ఆ వర్గాలు కోల్పోయాయని మండిపడ్డారు. దళిత ద్రోహి గిరిజన ద్రోహి కేసీఆర్ అంటూ విమర్మించారు. గత ఆరు సంవత్సరాల కాలంలో ఎస్.సి.ల అభివృద్ధికి అంటూ 86 వేల కోట్లను కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం కేవలం 50 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని గుర్తు చేశారు. గిరిజనులకు గత ఆరు సంవత్సరాల కాలంలో అభివృధి నిధులు అంటూ 40 వేల కోట్లు కేటాయించి కేవలం 19 వేల కోట్లే మాత్రమే ఖర్చు చేశారని ఆరోంచారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.


జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలి, కానీ ఆరు శాతం మాత్రమే అమలు చేశారని, స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తున్నది కేసిఆర్ ప్రభుత్వమన్నారు జీవన్ రెడ్డి. 317 జీవోను వ్యతిరేకిస్తే లాగులు ఉడతాయని కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. స్థానికతను విఘాతం కలిగించేలా 317 జీవో ఉందని... అర్టికల్ 371D కి విఘాతం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైయ్యిందని, కెసిఆర్ ఉద్యమ స్పూర్తి ఏమైందని ప్రశ్నిచారు జీవన్‌ రెడ్డి. కేసీఆర్ రాజ్యాంగం మార్చాలనే డిమాండ్ ఎందుకు మాట్లడుతున్నారో అర్దం కావడంలేదని, బిజెపి రాజ్యాంగం మార్చాలని అనుకుంటుంది కాబట్టే కేసీఆర్ రాజ్యంగం మార్పు అంటూ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్మించారు.