భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో "బీజేపీ భీం దీక్ష" చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొత్త రాజ్యాంగం వ్యాఖ్యల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పేవరకు వదిలిపెట్టేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.


ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజ్యాంగాన్ని తిరగరాయాలని కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా ఈరోజు ‘భీమ్ దీక్ష’ చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద దీక్షలో పాల్గొన్నం. కేసీఆర్ అహంకారంతో గర్వం తలకెక్కి మాట్లాడుతుండటాన్ని దేశమంతా చూస్తోంది. కేసీఆర్.. మీకెందుకింత అహంకారం?  బరితెగించి మాట్లాడుతూ ఇంకా సమర్ధించుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.







టీఆర్ఎస్ నేతలు కూడా బలుపెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. కేసీఆర్ కు సీఎం పదవి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్షే. లేకపోతే కొత్త రాష్ట్రం ఏర్పడేది కాదు.  దేశంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారు. ఆ రాజ్యాంగం ప్రకారం.... సీఎం, మంత్రులు సచివాలయానికి వెళ్లొద్దనుకుంటున్నారు. గడీలు నిర్మించుకోవాలని, తాను రాజునని కేసీఆర్ భావిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వద్దు... కల్వకుంట్ల రాజ్యాంగమే ముద్దు అని చెబుతున్నారు. కేసీఆర్ తానే దోచుకోవాలని, తన అవినీతిని, కుటుంబ పాలనను ఎవరూ ప్రశ్నించొద్దని కేసీఆర్ అనుకుంటున్నారని చెప్పారు.


సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం లేదు. దళితులకు మూడెకరాలు ఇవ్వనని చెప్రారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నడు. ఇంకా నీ నియంత పాలనను భరించాలా?. ప్రధాని పదవి నాకు అంబేద్కర్ పెట్టిన భిక్ష అని సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రకటించిన గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ. అంబేద్కర్ స్పూర్తితోనే శక్తివంతమైన దేశ రూపకల్పనలో మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్దంతులకు ఏనాడు హాజరు కాలేదు. తెలంగాణ సమాజం కేసీఆర్ ను భరించడానికి సిద్ధంగా లేరని బండి సంజయ్ అన్నారు.


రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చాలనుకున్న ఇందిరాగాంధీకి దేశ ప్రజలు చుక్కలు చూపిన సంగతి గుర్తుంచుకోవాలని సీఎం కేసీఆర్ కు హితవు పలికారు. కేసీఆర్ వ్యాఖ్యలన్నీ... స్ట్రాటజీలో భాగమేనని ఆ పార్టీ నేతలే చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి స్ట్రాటజీలతో ఇంకా ఎంతమందిని అవమానిస్తారని ప్రశ్నించారు. జాతీయ జెండాను మార్చాలంటాడేమో.. సనాతన ధర్మాన్ని పక్కనపెట్టాలంటాడేమో... అని ఎద్దేవా చేశారు. ఆనాడు బ్రిటీషర్లకు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు పడుతుందని.. కొత్త రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలపెట్టేది లేదన్నారు.





కర్నాటక ఎంపీ మునుస్వామి, రాష్ట్ర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి,  సమన్వయకర్త నూనె బాలరాజ్ తదితరులు ఈ మీడియాతో సమావేశంలో పాల్గొన్నారు.