చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులు చేసిన ప్రయత్నాన్ని ఎక్కడికక్కడ పోలీసులు నిలువరించారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే నెల్లూరు జిల్లా సహా చాలా ప్రాంతాల్లో కొంతమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు.. పోలీసులకే మస్కా కొట్టారు. 


ఆత్మకూరుకి చెందిన ఓ ఉపాధ్యాయుడు పెరాలసిస్ రోగిలాగా గెటప్ వేసి పోలీసుల కన్నుగప్పి రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. ఎంచక్కా విజయవాడ వెళ్లిపోయాడు. విజయాడ చేరుకున్నాక.. ఆయన కొలీగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  






నెల్లూరు పోలీస్ స్టేషన్లోనే ఓ టీచర్ కూలీ అవతారం ఎత్తాడు, మరో టీచర్ పెళ్లిళ్ల పేరయ్యలాగా పంతులు గెటప్ వేసుకున్నాడు. వీళ్లంతా పోలీసులకు మస్కా కొట్టి బెజవాడ చేరుకున్నారు.






ఇక మిగతా వారంతా ప్లానింగ్ లేక పోలీసులకు చిక్కారు. ఇలా బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో దొరికిన ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాల నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కి తరలించారు. పోలీస్ స్టేషన్లోనే ఉద్యోగులు నినాదాలు చేశారు. ప్రభుత్వం దిగిరావాలని, పీఆర్సీ సమస్యను పరిష్కరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 






గూడూరులో కూడా విజయవాడ రైళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఉద్యోగులు కామన్ మ్యాన్ గెటప్ వేసినా అక్కడ పోలీసులు వారిని పట్టేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విజయవాడ వెళ్లకుండా అడ్డుకున్నారు. 


కర్నూలులోని కొందరు ఉద్యోగులు ఏకంగా పెళ్లిళ్ల బస్సులో విజయవాడ చేరుకున్నారు.