ఉద్యోగసంఘాల నేతలు అడుగుతున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందని వాటిని పరిష్కరించమని అడగడం సరి కాదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  వ్యాఖ్యానించారు.  సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.  సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. వాటిని పరిష్కరిస్తామని ఉద్యోగ నేతలకు హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా చర్చలకు రవాలని, ఉద్యోగుల కార్యాచరణ పక్కనపెట్టాలన్నారు. తాము ఎంత చెప్పినా సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. 


 ఉద్యోగులు గురువారం చేసేది బలప్రయోగమని... వైషమ్యాలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని ఉద్యోగులను సజ్జల ప్రశ్నించారు.  ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందని.., ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు క్రెడిట్ అయ్యాయన్నారు. జీతాలు క్రెడిట్ చేయడం వల్ల పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలి, పాత జీతాలే ఇవ్వాలన్న రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్యపడదన్న ఆయన.. మిగిలిన డిమాండ్ అయిన పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల లాభం లేదని స్పష్టం చేశారు. డిమాండ్ల కోసం పట్టుబట్టేబదులు ప్రధాన సమస్యలపై చర్చలకు రావాలని సజ్జల సలహా ఇచ్చారు.  


ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని కోరామన్నారు. ఇప్పటి వరకు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఉద్యోగుల ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రమాదం ఉందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ఆందోళనపై ఉద్యోగ సంఘాల నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని  సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపినా ఆందోళన చేస్తామంటున్నారని  ఇప్పుడు వారిని కూడా తీసుకు వచ్చి, బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగ నేతలపై మండిపడ్డారు. 


ఉద్యోగులు చర్యలు తీసుకునే పరిస్థితి కి తెచ్చుకోవద్దని కోరుతున్నాని.. వారికి ఏ విధంగా చూసినా జీతాలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు.   ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.., అది తమ బాధ్యతన్నారు.  ఉద్యోగుల ఆందోళనకు పోలీసులు అనుమతి ఇచ్చే అవకాశం లేదని .. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘ నేతలు మాత్రం ప్రభుత్వం తమను పదే పదే చర్చల పేరుతో మోసం చేస్తోందని అంటున్నారు. తాము ముందు నుంచీ జీవోలను ఉపసంహరించాలని అడుగుతూంటే... ఇప్పుడు వేతనాలు వేసేశామని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది.