గిరిజన వన దేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. వరంగల్ - మేడారం మార్గం మధ్యలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మేడారం సమ్మక్క, సారలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళతారు. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క, సారలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది. మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళతారు. ఈ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధిగాంచింది. ఇంతకూ గట్టమ్మ తల్లి ఎవరు? ఆ తల్లి చారిత్రక నేపథ్యం చూద్దాం.


గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా తొలి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లిస్తారు. ఆ తర్వాత అమ్మవార్ల సన్నిధికి చేరుకుని సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. దశాబ్దాల కాలం నుండి మేడారం వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉన్నది. అసమాన, ధైర్య, శౌర్య, పరాక్రమాలతో అనుపమ త్యాగశీలంతో శతృవులతో రణం చేసి గొప్ప యుద్ధవీరవనితగా పేరు తెచ్చుకుని చరిత్రకెక్కింది. గట్టమ్మతల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులైనారు. అందుకే ఈ అమర వీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకుని వారికి గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. 


కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసి గిరిజన కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది. అందుకు గట్టమ్మ తల్లి, సమ్మక్క తల్లికి నమ్మిన బంటు కావడం వల్లేనని చెబుతారు. అందుకే శ్రీ రామునికి నమ్మిన బంటుగా ఉన్న ఆంజనేయుడు, శివునికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడు పూజలు అందుకుంటున్నట్లుగా, వన దేవతలకు నమ్మిన బంటు అయిన గట్టమ్మ తల్లి సమ్మక్క సారలమ్మ తల్లులతో సమానంగా పూజలందుకుంటున్నట్లు భక్తులు చెబుతారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం భక్తులలో నాటుకుపోవడంతో, ములుగు సమీపానగల గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. కానీ రాష్ర్ట ప్రభుత్వం గట్టమ్మ దేవాలయంపై చిన్నచూపు చూస్తోందని ఆదీవాసిలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


పెళ్లికాని యువతులు మంచి భర్త దొరకాలని, సంతానం లేని మహిళలు సంతానం కలగాలని, అన్నదాతల పంటలు మంచిగా పండాలని, తల్లితండ్రులు తమ పిల్లలు మంచిగా ఉండాలని, విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చి ఉద్యోగం సాధించాలని ఇలా అనేకమంది తమ సమస్యలను పరిష్కరించాలనీ గట్టమ్మ తల్లికి మొక్కుకుంటూ వరాలందుకుంటారు. అలాగే కొత్త వాహనాలు కొనుక్కున్నవారు గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి ప్రీతిపాత్రమై అనుగ్రహం పొంది తమ జీవితాల్లో విజయాలు సాధించుకుంటున్నారు. అందుకే ములుగు గట్టమ్మ తల్లి గుడి మరోశక్తిపీఠంగా ఎంతోమంది భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. గట్టమ్మ దేవాలయం దగ్గర భక్తుల కోసం సరైన వసతలు కల్పించాలని స్థానికులు చెప్తున్నారు.


గట్టమ్మ తల్లి పూజల్ని గిరిజన పూజా సంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండికామారం, కాలువపల్లి అడవి మార్గాల్లో, జంగాలపల్లి ఆవల ములుగు ప్రేమనగర్ వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించి సమ్మక్క, సారలమ్మల దేవతల అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. గట్టమ్మ తల్లి కూడా కోరినవారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహా మహిమాన్విత శక్తి దేవత అయినందున ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తిశ్రద్ధలతో కొలుస్తూ తల్లి దేవత కృపకు పాతృలై పలువురు భక్తులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో పాడి పంటలతో సుఖసంతోషాలతో చల్లగా వర్థిల్లుతున్నారు. దీంతో సమ్మక్క, సారలమ్మ తల్లుల భక్తులంతా గట్టమ్మ తల్లి భక్తులయ్యారు.