మేడారం జాత‌రకు భక్తుల రవాణా సౌకర్యాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయ్యారు. మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడనుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్​నుంచి మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులు వచ్చే నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయని, ఎంజీబీఎస్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.



ఎంజీబీఎస్ నుంచి బస్సులు


హైదరాబాద్ డిపో-1 సూపర్ లగ్జరీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతాయని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మేడారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి బయల్దేరుతాయని వెల్లడించారు. హైదరాబాద్ -2 డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు మేడారం నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతాయని చెప్పారు. పికెట్ డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 8 గంటలకు మేడారం నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు.ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ వెబ్ సైట్​లో, టీఎస్ఆర్టీసీ యాప్​లో బస్సులను బుక్ చేసుకునే వెసలుబాటు కల్పించామన్నారు. మేడారం ప్రత్యేక బస్సులకు రూ.398 ధర నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. 


మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు


భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 51 ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బస్ స్టేషన్ నిర్మించారు.  41 క్యు లైనర్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు 42 సీసీ కెమెరాల సర్వెలెన్స్ కేంద్రం ఏర్పాటు చేశారు. 1500 మంది ప్రయాణికులు విశ్రాంతి, పడుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులందరికీ శానిటైజ్ చేస్తామని, మాస్క్ లు అందిస్తామని ప్రభుత్వం  తెలిపింది. నార్లాపూర్ నుంచి జంపన్న వాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడపనున్నారు. మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, 20 రోజుల పాటు ప్రైవేట్ ఏసీ బస్సులు, ఇన్నోవా కార్లు రవాణా కోసం ఏర్పాటు చేయనున్నారు.  


Also Read: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పటిష్ట ఏర్పాట్లు... భక్తుల సౌకర్యార్థం 3,845 బస్సులు... జాతర నిర్వహణపై మంత్రుల సమీక్ష