టీమ్‌ఇండియాతో టీ20 సిరీసుకు వెస్టిండీస్‌ జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌ను ఓడించిన బృందానికే ఓటేసింది. 16 మందితో జట్టును ప్రకటించింది. మంగళవారం వీరంతా ఇంగ్లాండ్‌ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. బుడగ నుంచి బుడగలోకి వస్తున్నారు కాబట్టి కేవలం మూడు రోజుల క్వారంటైన్‌ మాత్రమే ఉంటుంది.


ఈ పర్యటనలో వెస్టిండీస్‌ మొదట మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత మూడు టీ20ల్లో తలపడుతుంది. వన్డే మ్యాచులకు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం మొతేరా వేదిక కానుంది. ఫిబ్రవరి 6, 9, 11న మ్యాచులు ఉంటాయి. ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో టీ20లు జరుగుతాయి. వన్డేలకు ముందుగానే జట్టును ప్రకటించిన విండీస్‌ ఇప్పుడు పొట్టి మ్యాచులకు ఎంపిక చేసింది.


విండీస్‌లో మొత్తం 11 మంది ఆటగాళ్లు వన్డేలు, టీ20ల్లో చోటు సంపాదించారు. ఇందులో కీరన్‌ పొలార్డ్‌, ఫాబియన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, జేసన్ హోల్డర్‌, షై హోప్‌, అకియెల్‌ హుస్సేన్‌, బ్రాండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌, రొమారియో షెఫర్డ్‌, ఒడీన్‌ స్మిత్‌, హెడెన్‌ వాల్స్‌ జూనియర్‌ ఉన్నారు. ఫిట్‌నెస్‌ ఇబ్బందుల వల్ల మరోసారి షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ను ఎంపిక చేయలేదు. ఫిట్‌నెస్‌ పట్ల అతడి అశ్రద్ధను ఆ జట్టు కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ అసంతృప్తిగా ఉన్నారు.


'బార్బడోస్‌లో నిర్వహించిన టీ20 సిరీసులో వెస్టిండీస్‌ అదరగొట్టింది. మేం అదే ఆటగాళ్లను ఎంపిక చేశాం. వారు మైదానంలో గొప్పగా పోరాడారు. నైపుణ్యాలు ప్రదర్శించారు. భారత్‌లోనూ వారిలాగే పోరాడాలని మేం కోరుకుంటున్నాం' అని విండీస్‌ చీఫ్‌ సెలక్టర్‌ డెస్మండ్‌ హెయిన్స్‌ అన్నారు.


ఈ సారి వెస్టిండీస్‌, టీమ్‌ఇండియా మధ్య పరిమిత ఓవర్ల సిరీసులు ఆసక్తిగా సాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో టీ20లను విండీస్‌ను మించి అద్భుతంగా ఆడే జట్టు మరొకటి లేదు. ఆ జట్టు నిండా భయంకరమైన హిట్టర్లు, ఆల్‌రౌండర్లే ఉంటారు. నిమిషాల్లో మ్యాచుల గమనాన్ని మార్చేస్తారు. అన్నింటినీ మించి హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ, బిగ్‌ మ్యాన్‌ కీరన్‌ పొలార్డ్‌ మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్‌లోనే కీరన్‌ పొలార్డ్‌ ఆడతాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఒకరి బలాబలాలేంటో మరొకరికి బాగా తెలుసు.


వెస్టిండీస్‌ టీ20 జట్టు: కీరన్‌ పొలార్డ్‌, నికోలస్‌ పూరన్‌, ఫాబియన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, రోస్టన్‌ ఛేజ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, డొమినిక్‌ డ్రేక్స్‌, జేసన్‌ హోల్డర్‌, షై హోప్‌, హుస్సేన్‌, బ్రాండన్‌ కింగ్‌, రోమన్‌ పావెల్‌, రొమేరియో షెఫర్డ్‌, ఒడీన్‌ స్మిత్‌, కైల్‌ మేయర్స్‌, హెడేన్‌ వాల్ష్‌ జూనియర్‌


టీమ్‌ఇండియా టీ20 జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, యుజ్వేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ సిరాజ్, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌