ప్రభుత్వం - ఉద్యోగుల మధ్య దూరం పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపైనా.. ముఖ్యమంత్రిపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం నియమించిన సంప్రదింపుల కమిటీలో సభ్యుడైన  బొత్స సత్యనారాయణ ఈ రోజు అయినా చర్చలకు ఎవరైనా వస్తారేమోనని సచివాలయంలో ఎదురు చూశారు. ఎవరూ రాలేదు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలపై అసహనం వ్యక్తం చేశారు. 


ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించడానికే చర్చలకు రావాలని అంటున్నామని.. అందుకే మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారన్నారు.  అసలు నాయకులు రాకుండా సెకండ్ స్థాయి నేతలు వచ్చి మూడు అంశాలపై మాకు లేఖ ఇచ్చి వెళ్లారన్నారు. ఇచ్చిన లేఖలోని అంశాలపై చర్చకు రావాలని కోరినా వాళ్ళు మాత్రం రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని.. మమ్మల్ని అలసత్వంగా తీసుకుంటున్నారేమోనని అభిప్రాయపడ్డారు. వాళ్ళు పిలిచే వరకూ చర్చలకు వెళ్లకూడదని అనుకున్నామని కానీ వచ్చామన్నారు. 


కొత్త పీఆర్సీ ప్రకారమే ఈ నెల జీతాలు వస్తాయని ప్రాసెస్ జరుగుతోందని బొత్స స్పష్టం చేశారు.  ఒకటవ తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వందే అంటున్న సంఘాల నాయకులు ట్రెజరీ ఉద్యోగుల్ని పని చేయొద్దు అంటున్నారని..జీతాల విషయంలో ఈ ద్వంద వైఖరి ఏంటని మంత్రి ప్రశ్నించారు. వాళ్ళు సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఎంత మందికి అయితే అంతమందికి జీతాలు ఇచ్చుకుంటూ పోతామని ఆపే ప్రశ్నే లేదన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచామని.. ఈ రోజు రిటైరయ్యే వారికి మరో రెండేళ్ల సర్వీసు వచ్చిందని.. ఇది ఉద్యోగులకు కావాలా వద్దా అని మంత్రి ప్రశ్నించారు. 


ఉద్యమం పేరుతో  ఉద్యోగ సంఘాల నేతలు మాటలు తూలనాడొద్దని మాటలకు బాధ్యత వహించాలని హెచ్చరించారు. మాకు మాటలు రావా.. మాట్లాడలేకనా..? అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ప్రభుత్వం - ఉద్యోగులు మధ్య దూరం పెరుగుతుందని సహనంతో ఉన్నామని.. దుర్భాషలు ఆడిన వారి పర్యవసానాలు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు.  ఉద్యోగుల్ని బూచిగా చూపించాల్సిన అవసరం మాకు లేదు.. ఉద్యోగులు మా వాళ్లేనని బొత్స స్పష్టం చేశారు. బొత్స వచ్చినా పీఆర్సీ సాధన సమితి సభ్యులెవరూ చర్చకు రాకపోవడంతో బొత్స పన్నెండు గంటల వరకూ ఎదురు చూసి వెళ్లిపోయారు. మరి కొన్ని రోజులు కూడా చర్చలకు ఉద్యోగులు వస్తారేమో ఎదురు చూసే అవకాశం ఉంది. చర్చలకు వస్తే అపోహలు తీరుస్తామని.. చర్చలు తప్ప ఇంకేం పరిష్కార మార్గం ఉందని మంత్రులు ప్రశ్నిస్తున్నారు.