ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఆహ్వానం పంపితే చర్చలకు వస్తామని పీఆర్సీ సాధన సమితి తెలిపింది. విజయవాడ పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అయింది. అనంతరం ఉద్యోగ సంఘాల నేతల మీడియాతో మాట్లాడారు. ఇవాళ స్టీరింగ్ కమిటీలో అన్ని విషయాలు చర్చించామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఉద్యోగులపై ఆరోపణలు చేస్తుందన్నారు. చర్చలకు ఇక పిలవమన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని బండి శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగుల్ని పక్క దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల పాత జీతాలు ఇవ్వాలని అడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. చర్చలకు రావాలని ఒకసారి వాట్సప్ మెసేజ్ మాత్రమే పంపారన్నారు. ఉద్యోగసంఘాల ప్రతినిధులను అవమానించేలా మాట్లాడారన్నారు. లిఖితపూర్వక ఆహ్వానం ఇస్తేనే చర్చలకు వెళ్తామని పేర్కొన్నారు. జీవోల రద్దు, పాతనెల జీతం, కమిటీ నివేదిక ఈ మూడు ప్రధాన డిమాండ్లకు ఒప్పుకుంటేనే చర్చలకు వెళ్తామని లేదంటే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
సీఎం జోక్యం చేసుకోవాలి
'మమ్మల్ని బెదిరిస్తూ డీడీవోలను ఇబ్బంది పెడుతున్నారు. ఉద్యోగులను రెచ్చకొట్టే ధోరణి కల్పిస్తున్నారు. చలో విజయవాడకు రాకుండా మాపై దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వం చిరు ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో జీతాలు, పీఆర్సీపై కన్ఫ్యూజన్ ఉంది. సీఎం జోక్యం చేసుకోవాలి' అని బండి శ్రీనివాసరావు అన్నారు.
ఆర్థికశాఖ అధికారులపై ఫిర్యాదు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ 'రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చర్యలు తీసుకోవద్దు. మాపై చర్యలు తీసుకోడానికి నిబంధనలు ఉన్నాయి. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటే నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆర్థికశాఖ అధికారులపై దిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తాం. సక్రమంగా విధులు నిర్వహించకపోతే చర్యలు తీసుకోవాలి. డీడీవోలకు నోటీసులు ఇచ్చే తాటాకు చప్పుళ్లకు భయపడొద్దు. డీడీవోలపై చర్యలు తీసుకుంటే పీఆర్సీ సాధన సమితి నాయకులు అండగా ఉంటారు. అవసరం అయితే న్యాయపరమైన అంశాల కోసం ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. స్టీరింగ్ కమిటీ సభ్యులను దిగువ శ్రేణి పౌరులుగా చూశామన్న ప్రభుత్వ కమిటీ విమర్శలు సరికాదు. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఆహ్వానం పంపితేనే చర్చలు ఉంటాయి.' అన్నారు.
సీనియర్ అడ్వొకేట్ ల సలహాలు
పీఆర్సీ సాధన సమితికి సంబంధించి ఇద్దరు సీనియర్ అడ్వొకేట్ లను నియమించుకుని న్యాయపరమైన సలహాలు తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు అన్నారు. వచ్చే నెల 3న విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తర్వాత బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, వీఆర్వోలు లక్షలాదిమంది విజయవాడ తరలిరావాలని ఆయన కోరారు. చలో విజయవాడను విజయవంతం చేయాలన్నారు. దీంతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. చలో విజయవాడను భగ్నం చెయ్యడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రకరకాల పుకార్లు, తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు.