తెలంగాణ వచ్చాకే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర రాష్ట్ర స్థాయి విస్తృత సమీక్ష సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రులు అన్నారు. వసతులు పెరిగాయని, గత 4 జాతరలకు రూ.332 కోట్లు ఖర్చు చేశామని మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరనుందని తెలిపారు. జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం నేడు రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించారు.
పారిశుద్ధ్య నిర్వహణకు 4 వేల సిబ్బంది
మేడారం జాతరకు వచ్చే భక్తులు, పూజారుల మనోభావాలు దెబ్బతినకుండా జాతర నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. జాతర కోసం చేపట్టిన పనులలో ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా శాశ్వత నిర్మాణాలు చేపట్టామన్నారు. ఓమిక్రాన్, కరోనా తీవ్రంగా ఉన్న కారణంగా ఆరోగ్య శాఖకు కోటి రూపాయలు కేటాయించామని చెప్పారు. గత జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గొచ్చని తెలిపారు. రోడ్ల పనులు, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా శాఖ పనులు 90 శాతం పూర్తి అయ్యాయన్నారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6400 టాయ్లెట్స్ ఏర్పాటు చేశామన్నారు. జాతర పటిష్ట నిర్వహణ కోసం మొత్తం ప్రాంతాన్ని 8 జోన్లుగా, 34 సెక్టర్లుగా విభజించినట్లు తెలిపారు. 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జాతర సమయంలో పారిశుద్ద్య నిర్వహణ కోసం 450 మంది సబ్ సెక్టోరియల్ ఆఫీసర్లు, 50 మంది సెక్టరియల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. మొత్తం 4000 మందిని పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేశామన్నారు. వీరితో పాటు జాతర సమయంలో దుమ్ము లేవకుండా ఉండడానికి 30 ట్రాక్టర్లు, చెత్త తొలగింపునకు 8 జేసీబీలు, 20 టాటా ఏస్ వాహనాలు, సేకరించిన చెత్తను డంప్ యార్డుకు తరలించడానికి 70 ట్రాక్టర్లు పెట్టామన్నారు.
భక్తుల కోసం 3,845 బస్సులు
జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం 50 బెడ్లతో సమ్మక్క-సారలమ్మ వైద్యశాల ఏర్పాటు చేసి, అక్కడే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6 పడకల వైద్య శాల, మరో 19 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రులు వివరించారు. వీటితో పాటు ములుగు, ఏటూరు నాగారం, పరకాల వద్ద తెలంగాణ వైద్య విధాన పరిషత్ దవాఖనాలు, తాడ్వాయి దగ్గర 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పస్రా దగ్గర 5 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇవి కాకుండా మేడారం వచ్చే 8 మార్గాల్లో మార్గం పొడవున 42 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర వైద్య సదుపాయం కోసం 15 అంబులెన్సులు, 15 బైక్ అంబులెన్సులు ఏర్పాటు చేసామన్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఒక ఐసోలేషన్ షెడ్ ఏర్పాటు చేశామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 28.5 లక్షల వ్యయంతో తప్పిపోయిన వారి కోసం 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. 51 ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయన్నారు. 50 ఎకరాల్లో బస్ స్టేషన్ నిర్మించామని, 41 క్యు లైనర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు 42 సీసీ కెమెరాల సర్వియలెన్స్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 1500 మంది ప్రయాణికులు విశ్రాంతి, పడుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులందరికీ శానిటైజ్ చేస్తామని, మాస్క్ లు అందిస్తామని మంత్రులు తెలిపారు.
బెస్ట్ ఫొటోలకు రూ.లక్ష నజరానా
నార్లాపూర్ నుంచి జంపన్న వాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్ సౌకర్యం కల్పించామని మంత్రులు తెలిపారు. జాతరలో నిత్యం వెలుగుల కోసం 4200 ఎల్.ఈ. డి బల్బులను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసామన్నారు. ఈసారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించామన్నారు. 10,300 మంది పోలీస్ సిబ్బంది, ప్రతి 4 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, పశ్రా నుంచి ప్రతి 2 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్, టోయింగ్ వాహనాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందన్నారు. మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, 20 రోజుల పాటు ప్రైవేట్ ఏసీ బస్సులు, ఇన్నోవా కార్లు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీడియా సెంటర్ లో వైఫై అవకాశం ఉంటుందన్నారు. 13 సాంస్కృతిక బృందాలతో సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత తెలిపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జాతర సందర్భంగా మంచి ఫోటోలు తీసిన వారిని గుర్తించి లక్ష రూపాయల బహుమతి ఇస్తామని తెలిపారు. సమావేశానికి ముందు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు, నేతలు అమ్మవార్లను దర్శించుకున్నారు.