ఉదయమే ఫెరారీ కారులో అలా వెళ్లి అక్కడ సొంత జెట్ ఎక్కి పద్ద దేశానికో.. ద్వీపానికో వెళ్లి టిఫిన్ చేసి అక్కడ్నుంచి ఏ లగ్జరీ బీచ్‌కో వెళ్లి కాసేపు సేదదీరి.. ఆ తర్వాత లంచ్ కోసం మరో దేశానికి వెళ్లి ..చివరికి ఏ నైట్ క్లబ్‌లోనే డిన్నర్ పూర్తి చేసి.. అదే విమానంలో వెనక్కి తిరిగి స్వదేశానికి చేరుకుని... ఉదయం వచ్చిన కారులో కాకుండా ఈ సారి బెంట్లే కారులో ఇంటికెళ్తే ఎలా ఉంటుంది?.  ఎవరికైనా ఇది చెబితే ఇంక చాల్లే ..లే లే పగలే నిద్రపోతున్నట్లున్నావ్ అని నిద్రలేపుతారు. కానీ నిజంగా ఇలాంటి కుబేరులున్నారు. ఎందుకు ఉండరు జుకర్ బర్గ్ , బిల్ గేట్స్.. అంత ఎందుకు మన అంబానీ కూడా అలాగే బతకలగలరు అని తేలిగ్గా తీసి పడేయకండి... ఇక్కడ మనం చెప్పుకుంటున్నది వారి సంగతి కాదు. ఓ తొమ్మిదేళ్ల బుడతడి గురించి. అతి లైఫ్ స్టైల్ గురించి. పైన చెప్పుకున్న లైఫ్ స్టైల్‌ను ఆ బుడతడు అనుభవించేస్తున్నాడు. అయితే అతను సంపన్నదేశాలకు చెందిన వాడు కూడా కాదు. నిరుపేద దేశంగా ప్రసిద్ధికెక్కిన నైజీరియా బుడతడు. 


 





పెద్ద విల్లా ముందు..  లగ్జరీ కార్ల ముందు ఫోటో దిగిన ఈ బుడతడి పేరు మహమ్మద్ అల్వాల్ ముస్తఫా. అందరూ ముద్దుగా ముంఫా జూనియర్ అని అని పిలుచుకుంటారు. ఎందుకంటే వాళ్ల నాన్న ముంఫా అని పిలుస్తారు.  ఇతనికి ఓ చాలా దేశాల్లో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి.  ఫెరారీ,  బెంట్లీ వంటీ కార్లు ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇవన్నీ అతని సొంతమే. అతని పేరు మీదే ఉన్నాయి. అందుకే ఇతన్నీ వరల్డ్ యాంగెస్ట్ బిలియనీర్ అని ముద్దుగా పిలుచుకోవడం ప్రారంభించారు. 






తన లగ్జరీ లైఫ్ స్టైల్‌ని పరిచయం చేయడానికి ఇటీవలే ఇన్‌స్టాలో ముంఫా అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇప్పటికి తొమ్మిది అంటే తొమ్మిది పోస్టలు పెట్టాడు. కానీ ఫాలోయర్స్ మాత్రం వేలకు వేలకు చేరుకున్నారు. ఈ తొమ్మిది పోస్టుల్లో ముంఫా పెట్టిన ఫోటోలు అన్నీ అతని లగ్జరీ లైఫ్ స్టైల్‌ని గుర్తు చేసేవే. తను ఎంత ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు వాడతాడో చూపించేవే. 


 






అంత వరకూ బాగానే ఉన్నా.. ఏంటీ ఇంత చిన్న వయసులో అలా సంపాదించేశాడా .. ఎలా ఎలా అని చాలా మంది ఆశ్చర్యపోతూంటారు కానీ.. నిజానికి అతను పైసా సంపాదించలేదు. అంతా వాళ్ల నాన్నవే. వాళ్ల నాన్న నైజీరియాలో మల్టీ మిలియనీర్. ఆయన తన కొడుకు కోసం అన్నీ కొనేస్తున్నాడు. అలా తొమ్మిదిళ్లే కుబేరుడిగా ముంఫా పేరు తెచ్చుకున్నాడు. ఆ ధనం సంగతేమో కానీ.. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పబ్లిసిటీ మాత్రం ముంఫాకి వాళ్ల నాన్నకు మంచి కిక్ ఇస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయిపోయారు మరి !