రాజ్ అండ్ డీకే తెలుగు వాళ్లైనప్పటికీ.. బాలీవుడ్ లో దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి 'ఫ్లేవర్స్', 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' వంటి సినిమాలను రూపొందించారు. ఆ తరువాత 'ది ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. సినిమాలతో రాని ఫేమ్ ఈ సిరీస్ తో వచ్చింది. ఇండియాలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మ్యాన్ ఒకటిగా నిలిచింది. 


ఇండియన్ ఆడియన్స్ ను వెబ్ సిరీస్ లకు అలవాటు పడేలా చేయడంలో ఈ దర్శక ద్వయం కీలకపాత్ర పోషించింది. కేవలం 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ను చూడడానికే చాలా మంది అమెజాన్ ప్రైమ్ ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 


అది అది పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుంది. ఇంతలోపు రాజ్ అండ్ డీజే మరో సిరీస్ ను లైన్ లో పెట్టారు. ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ తో కలిసి పని చేసిన వీరికి నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి ఆఫర్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించనున్న 'గన్స్ అండ్ గులాబ్స్' వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేయబోతున్నారు. 


ఇది ఫన్నీగా సాగే గ్యాంగ్ స్టర్ స్టోరీ అని తెలుస్తోంది. కథ సీరియస్ గా సాగుతూనే మంచి ఫన్ కూడా ఉంటుందట. 'ఫ్యామిలీ మ్యాన్' రెండు సీజన్లలో కూడా హీరో క్యారెక్టర్ తోనే కామెడీ పండించారు రాజ్ అండ్ డీకే. ఇప్పుడు 'గన్స్ అండ్ గులాబ్స్'లో ఇంకెంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో చూడాలి. ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.