విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్‌ ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ రోజు (బుధవారం) విడుదల చేశారు. మార్చి 4న సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.


టీజర్ చూస్తే... సినిమాలో హీరో హీరోయిన్లది పెద్దలు కుదిర్చిన కులాంతర వివాహమని చెప్పేశారు. "అరే... ఇంటర్ కాస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. సినిమాల్లో అయినా అయితదారా? నీకే ఫస్టా?" అని డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది. 'ఇప్పటివరకూ ఎన్ని సంబంధాలు చూశారు?' అని హీరోయిన్ పక్కనున్న అమ్మాయి అడిగితే... 'లెక్క పెట్టలేదు' అని హీరో చెప్పడం... 'అయితే పెద్ద నంబరే' అని ఆ అమ్మాయి అనడం బావుంది.


'గోదావరి అల్లుడు గారు పెళ్లికి ముందే పిల్ల చుట్టూ... అయ్ అయ్' అని అనడం ఆసక్తికరంగా ఉంది. పెళ్లి నేపథ్యంలో మంచి వినోదాత్మక సన్నివేశాలు, కుటుంబ అనుబంధాలు మాత్రమే కాదు... సినిమాలో ఎమోషన్ కూడా ఉందని 'తాగితే గానీ మా బతుకులకు ఏడుపు రాదు. తాగినోడి ఏడుపుకి ఏమో వేల్యూ లేదు' అని హీరో చెప్పే డైలాగ్‌తో చెప్పేశారు.


ఆల్రెడీ సినిమాలో 'ఓ ఆడపిల్ల..' సాంగ్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. జై క్రిష్ సంగీతం అందించిన ఈ సినిమాకు 'రాజావారు రాణీగారు' ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందించారు. మూడు పదుల వయసు వచ్చినా... పెళ్లి కాని ఓ అబ్బాయి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పెళ్లి కాని అబ్బాయిల ఇబ్బందులు ఏమిటి? అమ్మాయిల ఆలోచన ఏ విధంగా ఉందనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారట.