సాధారణ బిస్కెట్లతో పోలిస్తే డైజెస్టివ్ బిస్కెట్లు ఆరోగ్యమనే భావన చాలా మందిలో ఉంది. ఉదయం టీ కప్పుతో పాటూ పక్కన ఈ డైజెస్టివ్ కుకీలు లేదా బిస్కెట్లు కచ్చితంగా ఉండాల్సిందే. ‘డైజెస్టివ్’ అన్న పదమే అవి చాలా మంచివనే భావనను పెంచుతున్నాయి. ఇవి నిజంగా అంత ఆరోగ్యకరమా? వీటిని తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావా? ఆరోగ్యనిపుణులు ఏం అంటున్నారో చూద్దాం. 


ఎప్పుడు పుట్టాయంటే..
డైజెస్టివ్ బిస్కెట్లను తయారుచేసింది ఇద్దరు వైద్యులు. 1839లో జీర్ణక్రియకు సహాయపడటానికి స్కాట్లాండ్ కు చెందిన డాక్టర్లు రూపొందించారు. తరువాత యూకే లోని మెక్‌విటీస్ సంస్థ 1892 నుంచి వీటిని అమ్మడం మొదలుపెట్టింది. ఈ బిస్కెట్లు సెమీ స్వీట్‌గా ఉంటాయి. అంటే అంత తియ్యగా ఉండవన్నమాట. అందుకే మధుమేహులు కూడా ఇవి తాము తినొచ్చని అనుకుంటారు. 


వీటిని ఎలా తయారుచేస్తారు?
ఈ బిస్కెట్లను మొదట్లో గోధుమపిండి, అమ్మోనియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, టార్టారిక్ ఆమ్లం, వెజిటుబల్ ఆయిల్, స్కిమ్ మిల్క్, బేకింగ్ సోడా, పంచదారలతో తయారుచేస్తారు. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్దీ వీటి తయారీలో కూడా మార్పులు వచ్చాయి. గోధుమపిండికి బదులు బాగా శుధ్ది చేసిన పిండిని వాడుతున్నారు. చక్కెర, కొవ్వుపదార్థాలు, ప్రిజర్వేటివ్‌లు, సోడియం చేర్చి తయారుచేస్తున్నారు. ఒక బిస్కెట్లో 71 కేలరీల శక్తి, 1.1గ్రాముల ప్రొటీన్, 9.4గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3.2గ్రాములు కొవ్వు, 0.5గ్రాములు ఫైబర్, 0.1గ్రాములు సోడియం లభిస్తుంది. 


ఆరోగ్యకరమా?
డైజెస్టివ్ బిస్కెట్లను తయారుచేసే ముడిపదార్థాలు సాధారణ బిస్కెట్లకు వాడేవే. అందులోనూ ఇందులో ప్రాసెస్డ్ పిండినే వాడుతున్నారు కాబట్టి ఆరోగ్యకరమని చెప్పలేం.  మైదా వాడే అవకాశం కూడా చాలా ఎక్కువ. వాటిని అధికంగా తినడం అంత మంచిది కాదు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు తినకూడదు. చక్కెర కూడా ఉంటుంది కాబట్టి వారికి ఇది అంత ఆరోగ్యకరమైనది కాదు. ఈ బిస్కెట్లలో సంతృప్త కొవ్వులు ఉంటాయి, ప్రతి బిస్కెట్‌లో 3-5 గ్రాముల కొవ్వు ఉండవచ్చు. కాబట్టి ఇవి మీరు అనుకునేంత మంచివి కావు. అన్ని బిస్కెట్లలాగే ఇవి కూడా అంతే. వీటికి ప్రత్యేకంగా ‘ఆరోగ్యకరం’ అనే ట్యాగ్‌లైన్ ఇవ్వలేం. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: వాడేసిన టీ బ్యాగులు పడేస్తున్నారా? వాటితో ఇంట్లో ఇన్ని పనులు చేసుకోవచ్చు


Also read: ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి రక్తదానం చేయచ్చో తెలుసా? కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే