Unhappy Marriage Signs : ఇద్దరు వ్యక్తులు ఓ కుటంబంగా ఎదిగి.. సంతోషంగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి అనే బంధాన్ని ముడి వేస్తారు. అయితే ఈ కాలంలో దాని అర్థం పూర్తిగా మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్నా.. పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టి.. ప్రేమించుకున్నంత కాలం కూడా కలిసి ఉండలేక విడిపోతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. కేవలం లవ్ మ్యారేజ్ పరిస్థితే ఇలా ఉందనుకోకూడదు. పెద్దలు కుదిర్చిన వివాహంలో కూడా డివోర్స్ ఎక్కువగానే అవుతున్నాయి. 

కలిసి ఉండలేక డివోర్స్ తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కానీ కలిసి ఉంటూ విడిపోలేక ఉంటున్న జంటలు దానికి రెట్టింపు ఉన్నారట. ఆ తరహా జంటలు సైలెంట్ డివోర్స్ తీసుకుని కలిసి కాలం గడిపేస్తున్నారు. అదేంటి.. విడిపోతే విడాకులు అంటారు కానీ.. కలిసుంటే సైలెంట్ డివోర్స్ అనడమేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ రిలేషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 

సైలెంట్ డివోర్స్.. 

ఓ జంట కలిసి ఉంటూ.. ఒకే ఇంటిని షేర్ చేసుకుంటూ.. ఒకటే జీవితాన్ని పంచుకున్నప్పటికీ.. ఎమోషనల్​గా దూరంగా ఉండడమే సైలెంట్ డివోర్స్. ఈ జంటలో ఇద్దరూ కలిసే ఉంటారు. కానీ విడివిడిగా కలిసి ఉంటారు. కుటుంబం వల్లనో.. పిల్లలనే కారణం వల్లనో.. ఇతర ఏ కారణాలతో అయినా సరే వాళ్లు విడిపోవడానికి ఒప్పుకోరు. అలాగని ఒకరిపై ఒకరు ఇష్టాన్ని కూడా చూపించుకోరు. 

ఈ సైలెంట్ డివోర్స్​లో భర్త లేదా భార్య ఒకరినొకరు పట్టుకుంటే పరాయి వ్యక్తి అనే ఫీలింగ్​లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో లైంగికంగా కలిసి ఉన్నా.. దానిని ఓ యాంత్రిక చర్యగా ఫీల్ అవుతారే తప్పా.. ప్రేమగా తీసుకోలేరు. ఇద్దరూ కూర్చొని తమలోని భావాలు వ్యక్తం చేసుకోరు. రిలేషన్​ని ముందుకు తీసుకెళ్లడానికి ఓ రొటీన్ అయితే ఉంటుంది కానీ.. అది అర్థవంతంగా ఉండదు. ఇద్దరూ మాట్లాడుకోరా అంటే.. కచ్చితంగా మాట్లాడుకుంటారు. కానీ అవసరాల కోసమే తప్పా.. ఇతర ఏ ఫీలింగ్ వారి మధ్య ఉండదు. 

ప్రేమ కూడా రొటీనే..

ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవ్వడమనేది ఈ సైలంట్ డివోర్స్​లో భాగమే. నిజానికి ప్రేమ ఉంటే గొడవలు ఎక్కువగా ఉంటాయి అంటారు. కానీ ఈ తరహా జంటలు గొడవను అస్సలు దగ్గరకు రానీయరు. అది ప్రేమకోసం కాదు.. ఎనర్జీ సేవింగ్​లా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఊ కొడితే అయిపోద్దిగా.. దీనికి గొడవ ఎందుకులే అనేది వారి ఫీలింగ్. పుట్టినరోజులు, పెళ్లిరోజులు కూడా వారికి ఎగ్జైటింగ్​గా ఉండవు. కానీ అందంగా రెడీ అయిపోయి.. అందరి ముందు హ్యాపీగా ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. 

ఇలాంటివి ఒకటా.. రెండా ఎన్నో కారణాలు తమ కళ్లముందున్నా వారు మాత్రం విడిపోరు. ఎందుకంటే వారు విడిపోకుండా కలిసి ఉండడానికి ఎన్నో రీజన్స్ అడ్డువస్తాయి. మొదట్లో ఒకరి నుంచి ప్రారంభమైనా.. రోజులు గడిచే కొద్ది ఇద్దరికీ తమ పరిస్థితి అర్థమవుతుంది. బట్ స్టిల్ వారు విడిపోకుండా రిలేషన్​ని ముందుకు తీసుకెళ్తారు. సమాజం వారిది అన్యోన్య దాంపత్యం అన్నా సరే.. ఇంట్లో మాత్రం వారి మధ్య దాంపత్యమే ఉండదు. ఆ కపుల్స్​కి కావాల్సింది కూడా ఇదేనేమో మరి.