''ఎవరో ఎలిమినేట్ అయితేనో, జీవితంలో ఒకరు ఓడిపోతేనో చూసి సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు. ఈ మాట ప్రవస్తి ఆరాధ్య వల్ల ఈరోజు చెప్పుకోవాల్సి వస్తోంది. నేను చాలా కష్టాలు, బాధలు పడ్డాను. జీవితంలో నాకంటే లోయస్ట్ పాయింట్ నా తోటి కళాకారులలో ఎవరు చూడలేదు'' అని ప్రముఖ గాయని సునీత తెలిపారు.
'పాడుతా తీయగా'లో తనపై వివక్ష చూపించారని, వేధించారని యువ గాయని ప్రవస్తి ఆరాధ్య తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగర్ సునీత స్పందించారు. ప్రవస్తి చేసిన ప్రతి ఆరోపణకు ఆవిడ వివరణ ఇచ్చారు. 'ప్రవస్తి... నువ్వు చేసింది చాలా తప్పు అమ్మా' అంటూ చాలా సూటిగా సమాధానాలు ఇచ్చారు.
'ముద్దుగా పాడావు' అని ఉంటారు...
ఇప్పుడూ అలాగే పాడితే సంతోషించేదాన్ని!
చిన్నతనం నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు, జానకి గారు ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేసినట్టు తాను కూడా ప్రవస్తి ఆరాధ్యని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేశానని సునీత వివరించారు. ఆ అమ్మాయి నేరుగా సునీత అని పేరు పెట్టి ప్రస్తావించింది కనుక తాను ఈ వివరణ వీడియో చేస్తున్నానని ఆమె తెలిపారు.
''ప్రవస్తి ఆరాధ్య... ఇప్పుడు నీకు 19 ఏళ్ళు కదా! నీ చిన్నతనంలో మా ఓడిలో కూర్చోబెట్టుకుని ముద్దు చేసినట్టు ఇప్పుడు చేస్తే బాగోదు కదా! అప్పట్లో 'నువ్వు బాగా పాడావు' అనేదానికంటే 'చాలా ముద్దుగా పాడావు' అనేవారు. అది నీకు గుర్తుందో? లేదో? అప్పుడు నువ్వు ముద్దుగా ఉండే దానివి ముద్దుగా పాడే దానివి అప్పట్లో పాడినట్టు 19 ఏళ్లకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అందరికంటే ఎక్కువ నేనే సంతోషించేదాన్ని'' అని సునీత చెప్పారు.
ప్రవస్తి ఆరాధ్య ఇచ్చిన పాటలు ఎందుకు వద్దన్నారంటే?
చెబితే అన్ని విషయాలు చెప్పాలని ప్రవస్తి ఆరాధ్యను సునీత సూటిగా అడిగారు. తాను పడతానన్న పాటలను వద్దని 'పాడుతా తీయగా' నిర్వాహకులు తెలిపారని ప్రవస్తి ఆరాధ్య ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ విమర్శ మీద సునీత స్పందిస్తూ... ''సింగింగ్ రియాలిటీ షోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఛానల్ దగ్గర కొన్ని పాటలకు సంబంధించిన రైట్స్ మాత్రమే ఉంటాయి. సింగర్స్ ఇచ్చిన పాటలలో రైట్స్ ఉన్నవి మాత్రమే ఎంపిక చేస్తారు. అందులోనూ ఆ పాట ఎన్నిసార్లు రిపీట్ అయిందనేది చూస్తారు. రిజెక్ట్ చేసిన విషయం మాత్రమే చెప్పింది గానీ ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేది ప్రేక్షకులకు తెలియదు గనుక ఇప్పుడు ఈ విషయం చెబుతున్నాను'' అని చెప్పారు.
మ్యాంగోలో ప్రవస్తి ఆరాధ్య పాడింది...
ఆ అమ్మాయిని ఎందుకు కొరకరా చూస్తా!
తనను కొరకొర చూసినట్లు ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేసిందని, ఆ విధంగా తాను ఎందుకు చూస్తానని సునీత ప్రశ్నించారు. ఆ అమ్మాయికి గుర్తుందో? లేదో? పాడుతా తీయగాలో క్లాసిక్ రౌండ్ ముగిసిన తరువాత అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదని ఆమె దగ్గరకు వెళ్లి మరి తాను చెప్పినట్లు సునీత తెలిపారు. మ్యాంగో మ్యూజిక్ సంస్థ రూపొందించిన అష్టలక్ష్మి స్తోత్రంలో ప్రవస్తి ఆరాధ్య కోరస్ పాడిందని, ఆమె వీడియోలో కూడా కనిపిస్తుందని సునీత వివరించారు. వేరే సింగర్స్ పట్ల ఫేవరెటిజం చూపించేటట్లయితే ఆమెను తమ సంస్థ రూపొందించిన వీడియోలోకి ఎందుకు తీసుకుంటామని ఆవిడ ప్రశ్నించారు.
పెళ్లిళ్లలో పాటల విషయానికి వస్తే...
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా!
పెళ్లిళ్లలో కచేరీలు చేయడం పట్ల కీరవాణి చిన్నచూపు చూడడంతో పాటు తనను విమర్శించారని ప్రవస్తి ఆరాధ్య వాపోయిన సంగతి తెలిసిందే. ఆ విషయానికి వస్తే తాను కూడా పెళ్లిళ్లలో పాటలు పాడతానని, ప్రస్తుతం ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అనిరుద్ కూడా పాడుతున్నారని సునీత తెలిపారు. కీరవాణి గారు తాను ఎందుకు పెళ్లిళ్లలో కచేరీలు చేయరనేది చెప్పారని, ఒకవేళ ఆయన మాటలకు ఫీల్ అవ్వాల్సి వస్తే ముందు తాను ఫీల్ అవ్వాలని సునీత అన్నారు.
నన్ను మోసగత్తే అన్నారు...
ప్రవస్తి ఆరాధ్య తల్లి తూలనాడారు!
తన తల్లిని నువ్వు అంటూ సునీత సంబోధించారని సంస్కారవంతంగా ప్రవర్తించలేదని ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఆ విషయం పట్ల కూడా సునీత స్పందించారు.
ప్రవస్తి ఆరాధ్య ఎలిమినేట్ అయిన వెంటనే ట్రోఫీ తీసుకోవద్దని స్టేజి దగ్గరకు వెళ్లి ఆవిడ తల్లి సీన్ క్రియేట్ చేశారని సునీత వివరించారు. ఆ తరువాత తన ముందుకు వచ్చి చేత్తో ముఖం మీద 'నువ్వు ఒక మోసగత్తె' అని తనను తిట్టినట్లు కూడా సునీత తెలిపారు. అదంతా కెమెరాలలో రికార్డ్ అయిందని అది ఛానల్ వాళ్లు విడుదల చేసే అవకాశం లేకపోలేదని అన్నారు. ప్రవస్తి ఆరాధ్యకు ఆమె తల్లి ప్రవర్తన సంస్కారవంతంగా అనిపించిందా? అంటూ సునీత ప్రశ్నించారు.
Also Read: ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఫోటోలు డిలీట్... విడాకుల దిశగా సింగర్ హారికా నారాయణ్?
ఓటమిని ప్రవస్తి ఆరాధ్య, ఆమె తల్లి తీసుకోలేకపోతున్నారని... పోటీలలో గెలుపు - ఓటమి సహజమని, వాటిని స్వీకరించే గుణం ఉండాలని సునీత అన్నారు. ప్రవస్తి ఆరాధ్య తల్లి చేత కీరవాణి, చంద్రబోస్, తాను మాటలు పడ్డామని... తమ పిల్లలు నాశనం కావాలని ఆవిడ తిట్టారని, ఇది మంచి పద్ధతి కాదని సునీత హితవు పలికారు. ప్రవస్తి ఆరాధ్య జీవితంలో పైకి రావాలని ఆశీర్వదించారు.