రక్తం ప్రాణాధారం. ఏ ప్రమాదమో జరిగి రక్తం పోతే తిరిగి రక్తం ఎక్కించి ప్రాణాలు కాపాడతారు. ఏ రక్తం పడితే ఆ రక్తం ఎక్కిస్తే ప్రాణానికే ప్రమాదం. మీ బ్లడ్ గ్రూపు లేదా, ఆ గ్రూపుకు 
సరిపడే ఇతర గ్రూపులకు చెందిన రక్తాన్ని మాత్రమే ఎక్కించాలి. బ్లడ్ గ్రూపులు ప్రధానంగా నాలుగు. ఎ, బి, ఓ, ఏబీ, వాటిలో పాజిటివ్, నెగిటివ్ ఇలా ఎనిమిది రకాలు ఉన్నాయి. దాదాపు ఈ రక్త గ్రూపులే అందరికీ ఉంటాయి. ఎక్కడో చాలా అరుదుగా బాంబే బ్లడ్ గ్రూపు ఉంటుంది. అయితే సాధారణంగా దొరికే బ్లడ్ గ్రూపులతోనే అధికంగా అవసరం పడుతుంది. మీరు ఎవరికైనా దానం చేయాలన్నా, లేక మీరు ఎవరి నుంచి రక్తం పొందాలన్నా అందుకు సంబంధించి కనీస అవగాహన ఉండాలి. ఏ బ్లడ్ గ్రూపుల వారు ఎవరికి రక్తం దానం చేయచ్చు, ఎవరి నుంచి రక్తం పొందొచ్చో తెలుసుకుందాం. 


1. A పాజిటివ్
ఈ గ్రూపు వారు అదే గ్రూపుకు చెందిన వారికి, AB పాజిటివ్ రక్తం కలిగిన వారికి దానం చేయచ్చు. అదే రక్తం పొందాలంటే మాత్రం A పాజిటివ్, A నెగిటివ్, O నెగిటివ్, O పాజిటివ్ గ్రూపులకు చెందిన వారి నుంచి తీసుకోవచ్చు. 
2. A నెగిటివ్ 
ఈ గ్రూపు వారు A పాజిటివ్, A నెగిటివ్, AB పాజిటివ్, AB నెగెటివ్ బ్లడ్ గ్రూపుల వారికి రక్తదానం చేయచ్చు. అలాగే A నెగిటివ్, O నెగిటివ్ రక్తాన్ని తీసుకోవచ్చు.  
3. O పాజిటివ్
ఈ గ్రూపు వారు O పాజిటివ్, A పాజిటివ్, B పాజిటివ్, AB పాజిటివ్  రక్త గ్రూపులకు రక్త దానం చేయచ్చు. O పాజిటివ్, O నెగెటివ్ రక్తాన్ని తీసుకోవచ్చు.
4. O నెగెటివ్ 
ఈ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వారు ఎవరికైనా ర‌క్తం ఇవ్వవచ్చు. తీసుకున్నప్పుడు మాత్రం కేవలం తమ బ్లడ్ గ్రూప్ వారి రక్తాన్నే తీసుకోవాలి. 
5. B పాజిటివ్ 
ఈ బ్ల‌డ్ గ్రూప్ వారు B పాజిటివ్‌, AB పాజిటివ్ వారికి ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు. B పాజిటివ్‌, B నెగెటివ్‌, O పాజిటివ్‌, O నెగెటివ్ బ్ల‌డ్ గ్రూప్స్ ఉన్న‌వారి నుంచి ర‌క్తం తీసుకోవ‌చ్చు.
6. B నెగెటివ్ 
బ్ల‌డ్ గ్రూప్ వారు B పాజిటివ్‌, B నెగెటివ్‌, AB పాజిటివ్, AB నెగెటివ్‌ బ్లడ్ గ్రూప్స్ వారికి ర‌క్తదానం చేయచ్చు. B నెగెటివ్‌, O నెగెటివ్ బ్ల‌డ్ గ్రూప్స్ వారి నుంచి ర‌క్తం తీసుకోవ‌చ్చు.
7. AB పాజిటివ్ 
బ్ల‌డ్ గ్రూప్ వారు కేవ‌లం అదే గ్రూప్‌కు చెందిన వారికి ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు. కానీ ఇత‌ర ఏ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వారి నుంచైనా స‌రే ర‌క్తం తీసుకోవ‌చ్చు.
8. AB నెగెటివ్ 
బ్ల‌డ్ గ్రూప్ వారు AB పాజిటివ్‌, AB నెగెటివ్ బ్ల‌డ్ గ్రూప్‌ వారికి ర‌క్తదానం చేయచ్చు. AB నెగెటివ్‌, A నెగెటివ్‌, B నెగెటివ్‌, O నెగెటివ్ బ్ల‌డ్ గ్రూప్ వారి నుంచి ర‌క్తం పొందచ్చు.