మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్.. పాన్ ఇండియా సినిమాగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోన్న 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తయింది.
పూణేలో నిర్వహించిన షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు. ఆ తరువాత కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఫైనల్ గా ఇప్పుడు కొత్త షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఇక్కడ కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను, ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారు.
అయితే ఈ షెడ్యూల్ లో హీరోయిన్ కియారా పాల్గొనడం లేదట. రామ్ చరణ్ తో పాటు అంజలి, శ్రీకాంత్ లాంటి నటులు ఈ షూటింగ్ లో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 10న ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టి.. ఫిబ్రవరి 28 వరకు నిర్విరామంగా షూటింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన పర్మిషన్స్ కూడా చిత్రబృందం తెచ్చుకుంది. అనుమతి పత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ వ్యవస్థ, ఉద్యోగులు నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. జయరామ్, నవీన్ చంద్ర, సునీల్ లాంటి నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.